Online Shopping Tips: ఈ చిట్కాలతో ఆన్ లైన్ షాపింగ్ సురక్షితం.. గుర్తుంచుకోవాల్సిన అంశాలివే..
ఆన్ లైన్ షాపింగ్ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాల నుంచి రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. సైబర్ నేరగాళ్ల తరచూ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఆన్ లైన్ షాపింగ్ విధానం వచ్చాక ప్రజలందరూ చాలా సులభంగా, తొందరగా షాపింగ్ చేస్తున్నారు. ఇంటి దగ్గరే ఉండి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు. దీనివల్ల సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఒకేసారి అనేక వస్తువులను పరిశీలించి, ధరల వివరాలు తెలుసుకుని తమకు నచ్చిన దానిని ఎంచుకునే సౌలభ్యం కూడా దీనిలో లభిస్తుంది. గతంలో షాపింగ్ చేయాలంటే పెద్ద పనిలా ఉండేది. ఏ వస్తువులను కొనుగోలు చేయాలో ముందు నిర్ణయించుకోవాలి. అవి దొరికే దుకాణాల వద్దకు వెళ్లాలి. బస్సులు, లేదా ఆటోలలో అక్కడకు వెళ్లి కొనుగోలు చేయాలి. వాటిని మళ్లీ మన ఇంటికి తీసుకురావాలి. ఈ విధానంలో డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేవి.
తప్పిన ఇబ్బందులు..
ఆన్ లైన్ షాపింగ్ విధానంలో ఆ ఇబ్బందులు తప్పాయి. దుకాణాలకు తిరిగి వస్తువులను కొనాల్సిన అవసరం తప్పింది. వందల కొద్దీ వస్తువులను కేవలం మీ స్మార్ట్ ఫోన్ లో పరిశీలించి, నచ్చిన దానిని బుక్ చేసుకోవచ్చు. ఆ వస్తువు ఇంటికి డెలివరీ అయ్యాకే డబ్బులు చెల్లించే వీలు కూడా ఉంటుంది.
అనేక లాభాలు..
ఆన్ లైన్ షాపింగ్ వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాల నుంచి రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. సైబర్ నేరగాళ్ల తరచూ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
జాగ్రత్తలు ఇవే..
ఆన్ లైన్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు వినియోగదారులకు ఈ కింది తెలిపిన జాగ్రత్తలు తీసుకోవాలని ఓఎల్ఎక్స్ సూచించింది. ఓఎల్ ఎక్స్ అనేది వస్తువులను కొనడానికి, అమ్మడానికి ఉపయోగించే ఆన్ లైన్ ప్లాట్ ఫాం.
విశ్వసనీయ వెబ్‌సైట్లు.. విశ్వసనీయ వెబ్ సెట్ల లోనే ఆన్‌లైన్ లో వస్తువులను కొనుగోలు చేయాలి. ప్రధాన రిటైలర్లు, ప్రముఖ బ్రాండ్లు తమ ఖాతాదారుల సమాచారాన్ని రక్షించడానికి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాయి. వెబ్‌సైట్ యూఆర్ఎల్ లో హెచ్ టీటీపీఎస్ ఎన్‌క్రిప్షన్ కోసం చూడండి, అడ్రస్ బార్‌లో ప్యాడ్‌లాక్ చిహ్నం ద్వారా దాన్ని గుర్తించవచ్చు.
పాస్‌వర్డ్.. మీరు మీ బ్యాంకు ఖాతాలన్నింటికీ ఒకే పాస్ వర్డ్ పెట్టుకోకూడదు. దానివల్ల అనేక నష్టాలు జరుగుతాయి. స్కామర్ మీ పాస్ వర్డ్ ను హ్యాక్ చేస్తే మొత్తం ఖాతాలన్నీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఆన్ లైన్ ఖాతాకు ప్రత్యేక పాస్ వర్డ్ సెట్ చేసుకోండి.
డేటా భద్రత.. ఇ-కామర్స్ దుకాణాలు వస్తువుల కొనుగోలు చేయడానికి ఖాతాను తెరవమని మిమ్మల్ని ప్రోత్సహించడం సర్వసాధారణం. దీనివల్ల మీ కొనుగోళ్లు సులభతరమవుతాయి. అయితే దానిలో మీ వ్యక్తిగత సమాచారం ఉన్నందున డేటా ఉల్లంఘనలకు సంబంధించిన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనప్పుడల్లా గెస్ట్ గా షాపింగ్ చేయండి.
సమాచారం గోప్యత.. సాధారణంగా ఓటీపీలు మీ ఫోన్ కు ఎస్ఎమ్ఎస్ రూపంలో, లేదా ఇమెయిల్ కు వస్తుంటాయి. వాటిని ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు. వాటిని బయటవారికి చెప్పడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది.
ఉచిత వైఫైతో అనర్థాలు.. ఉచితంగా లభించే వైఫైను వాడుకోవడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశం ఉంది. మీ పేరు, చిరునామా, ఆర్థిక సమాచారం వంటి వివరాలను పబ్లిక్ లేదా ఉచిత వైఫైల ద్వారా సులభంగా దొంగిలించవచ్చు. అలాగే నేరగాళ్ల మిమ్మల్ని స్కామ్‌ల వైపు ఆకర్షించడానికి ఉచిత వైఫైకి యాక్సెస్‌ను సెటప్ చేయవచ్చు.
మోసపూరిత ఈ-మెయిల్స్.. మీ ఆన్ లైన్ ఖాతాల లాగిన్ లు, క్రెడిట్ కార్డు వంటి సమాచారం కోసం కొన్ని మోసపూరిత ఇమెయిల్ లు, వెబ్ సైట్ లు ప్రయత్నిస్తాయి. లింక్ లపై క్లిక్ చేయాలని, వ్యక్తిగత సమాచారం కావాలని అడుగుతాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి.
రేటింగ్ పరిశీలన.. ఆన్ లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఇతర కస్టమర్ల సమీక్షలు, ఇచ్చిన రేటింగ్‌లను తప్పక పరిశీలించాలి. ఉత్పత్తి నాణ్యత, షిప్పింగ్ సమయాలు, మోసపూరిత ప్రవర్తనకు సంబంధించి ఏదైనా ప్రతికూల అభిప్రాయం వస్తే చదవండి. అధిక రేటింగ్, సానుకూల సమీక్షలున్న వాటిని ఎంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..