
ఒక సంస్థ తన ఉద్యోగులకు నగదు రూపంలో అందించే ప్రయోజనాన్నే గ్రాట్యూటీ అనవచ్చు. ఉద్యోగి జీతంతో సహా డీఏ ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఆ ఉద్యోగికి చివరిసారిగా అందిన బేసిక్ పేపై గ్రాట్యూటీని లెక్కిస్తారు. పనిచేసిన సంవత్సరానికి 15 రోజుల వేతనానికి సమానమైన సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు ఒక సంస్థలో 4 ఏళ్ల 240 రోజుల సర్వీసు పూర్తి చేసుకున్నా గ్రాట్యూటీకి అర్హత పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి 2021 జనవరి 1న ఒక సంస్థలో పనిచేయడం ప్రారంభించి, 2025 ఆగస్టు 29 నాటికి మానేసినా గ్రాట్యూటీ పొందవచ్చు.
గ్రాట్యూటీ చెల్లింపు చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం ఒక ఉద్యోగి ఐదేళ్ల పాటు నిరంతర సేవ అందిస్తేనే అతడికి గ్రాట్యూటీ వర్తిస్తుంది. ఆ చట్టంలోని సెక్షన్ 2ఏ నిరంతర సేవను సూచిస్తుంది. అలాగే 2ఏ (2) నిరంతరం సేవలో ఉండాల్సిన వ్యక్తిని నిర్వచిస్తుంది. ఒక వ్యక్తి గత 12 నెలల్లో యాజమాని కింద కనీసం 190 లేదా 240 రోజుల పనిచేస్తే.. అతడు ఒక ఏడాది పాటు నిరంతర సేవలో ఉన్నట్టు పరిగణిస్తారు.
భూగర్భ గనులు, వారానికి ఆరు రోజుల కన్నా తక్కువ పనిచేసే సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు ఏడాదికి 190 రోజులు పనిచేయాలి. మిగిలిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు 240 రోజులు అవసరం. దీని ప్రకారం ఒక ఉద్యోగి ఐదో సంవత్సరంలో 240 రోజుల కంటే ఎక్కువ పనిచేసినప్పుడు, అదనపు సంవత్సరం సర్వీస్ ను లెక్కిస్తారు. అంటే 4 ఏళ్ల 240 రోజుల సర్వీసు పూర్తి చేస్తే గ్రాట్యూటీ పొందవచ్చు.
చట్ట పరిధిలోని నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించి గ్రాట్యూటీని లెక్కిస్తారు. ఒక సంస్థ గత 12 క్యాలెండర్ నెలల్లో ఏదైనా ఒక రోజు 10 లేదా అంతకంటే ఎక్కువ మందిని నియమిస్తే చట్ట పరిధిలోకి వస్తుంది. ఆ తర్వాత సిబ్బందిని తగ్గించినా చట్టాలని లోబడే ఉంటుంది. ఏడాదిలో ఆరు నెలలకంటే ఎక్కువ పనిచేసినా ఏడాదిగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 4 ఏళ్ల 300 రోజులు కంపెనీలో సేవలందించాడు. అతడి సర్వీసు 4 ఏళ్ల 240 రోజులకు పైబడి ఉంది కాబట్టి గ్రాట్యూటీకి అర్హుడు. అతడికి రూ.40 వేలు ప్రాథమిక జీతంతో 300 రోజులు 9.863 నెలలుగా మారతాయి. అదనపు ఆరు నెలలు దాటినప్పుడు అది ఏడాదిగా పరిగణిస్తారు. తద్వారా అతడికి రూ.1,15,385 గ్రాట్యూటీ అందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి