Petrol station scams: పెట్రోలు బంకుల్లో పెరుగుతున్న మోసాలు.. ఈ చిట్కాలతో వాటికి చెక్..!
ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ సొంత వాహనాన్నివినియోగిస్తున్నారు. కారు లేదా ద్విచక్ర వాహనాలను తమ స్తోమత, అవసరాలను అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు. నేటి స్పీడ్ యుగంలో వేగంగా పనులు జరగాలన్నా, తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నా సొంత వాహనం చాలా అవసరం. అయితే వీటిలో నిత్యం ఇంధనాన్ని నింపుకోవాలి. దాని కోసం దగ్గరలోని పెట్రోలు బంకులకు వెళ్లడం సర్వసాధారణం. కానీ కొన్ని పెట్రోలు బంకుల్లో కస్టమర్లను మోసం చేసే వ్యూహాలను అమలు చేస్తారని, వాటి నుంచి అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలు బంకులో ఇంధనం నింపుకొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

కారు లేదా బైక్ లో పెట్రోలు నింపే ముందు, తర్వాత పంపుపై మీటర్ రీడింగ్ ను గమనించాలి. మీకు కొనుగోలు చేసిన ఇంధన పరిమాణం దానిలో చూపిన అంకెలతో సరిపోయిందో, లేదో చూసుకోండి. డిస్ ప్లే లో ముందుకు దూకినట్టు అనిపించినా, అస్తవ్యస్తంగా కనిపించినా వేరే పంపు కోసం అడగండి. అక్కడి స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయండి. నాణ్యమైన ఇంధనంతో మీ వాహనం మన్నిక, మైలేజీ బాగుంటాయి. తక్కువ నాణ్యత గల ఇంధనాన్ని వాడితే అనేక సమస్యలు వస్తాయి. వాహనం మైలేజీ తగ్గడం, ఇంజిన్ హార్డ్ గా మారడం, పరుగులో తేడా కనిపిస్తాయి. కాబట్టి నమ్మకమైన పెట్రోలు బంకుకు వెళ్లడం చాలా ముఖ్యం. సాధారణంగా పెట్రోలు ధర అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది. కానీ చుట్టుపక్కల బంకుల కంటే తక్కువ ధరకు ఇంధనం అందిస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. అది మిమ్మల్ని మోసం చేయడానికి చేసే ప్రయత్నం కావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ధరలను గమనించాలి.
మీ వాహనంలో ఇంధనం నింపే సహాయకుడి చర్యలను గమనించాలి. అతడు పంపును తారుమారు చేయకూడదు, సరైన అనుమతి లేకుండా మీటర్ ను సర్దుబాటు చేయకూడదు. పెట్రోల్ బంకులో సహాయకుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే అప్రమత్తమవ్వాలి. పెట్రోలు బంకులో ఇంధనం కొట్టించుకున్న తర్వాత రశీదును తీసుకోవడం మర్చిపోవద్దు. కొలతల్లో వ్యత్సాసాలు, సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి రశీదు ఎంతో ఉపయోగపడుతుంది. బంకుల్లో మోసం జరుగుతున్నట్టు, అక్రమాలకు పాల్పడుతున్నట్టు గమనిస్తే వెంటనే స్టేషన్ నిర్వహణ, వినియోగదారుల రక్షణ సంస్థలకు నివేదించండి. వీలైనన్ని ఆధారాలు సమర్పించాలి.
పెట్రోలు బంకుల్లో సాధారణంగా జరిగే మోసాలపై అవగాహన పెంచుకోండి. అప్పుడే అప్రమత్తంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. మోసం జరిగితే వెంటనే ప్రశ్నించటానికి అవకాశం కలుగుతుంది. మీకు నమ్మకంగా ఉండే బంకుల్లోనే ఇంధనం కొనుగోలు చేయండి. కొన్ని బంకులు నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తాయి. అక్కడ మోసాలు జరిగే అవకాశం ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




