Risk Free Investments: రిస్క్ తక్కువ.. రాబడి ఎక్కువ.. మదుపరులకు ఇవే బెస్ట్ ఆప్షన్స్
రిస్క్ లేని పెట్టుబడి పథకాల కోసం వెతుకుతున్నారా? పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వ భరోసా కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మీ సెర్చింగ్ కు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి.. మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అస్సలు రిస్క్ లేని, స్థిరమైన రాబడిని అందించేవి ఉన్నాయి. అలాంటి వాటిల్లో బెస్ట్ పథకాలను ఎంపిక చేసి మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

జీవితంలో పొదుపు అనేది చాలా అవసరం. మనం సంపాదించే మొత్తం నుంచి మన ఖర్చులు, అవసరాలు పోను తప్పనిసరిగా పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అందుకోసం కచ్చితమైన ప్రణాళిక ఉండాలని సూచిస్తుంటారు. కేవలం పొదుపు మాత్రమే కాదు.. అలా పొదుపు చేసిన మొత్తాన్ని ఏదో ఒక పథకంలో పెట్టుబడిగా పెట్టాలని చెబుతుంటారు. అప్పుడే లాభాలు గడించే అవకాశం ఉంటుందని వివరిస్తుంటారు. అయితే చాలా మంది పెట్టుబడి పెట్టే విషయంలో ఆందోళన చెందుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి వాటిల్లో రాబడికి గ్యారంటీ ఉండదు. రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భంలో రిస్క్ ఫ్రీ పెట్టుబడి పథకాల గురించి వెతుకుతుంటారు. మీరు కూడా అలాంటి వాటి గురించే చూస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.. మార్కెట్లో చాలా రకాల రిస్క్ రహిత పెట్టుబడి పథకాలున్నాయి. వాటిలో ప్రాధాన్యమై పథకాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం..
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం..
ఈ పథకం పదవీవిరమణ పొందిన వ్యక్తులకు మంచి ఆప్షన్. పోస్టాఫీసుతో పాటు అన్ని ప్రముఖ బ్యాంకుల్లో ఈ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం(ఎన్సీఎస్ఎస్) అమలవుతోంది. దీనిపై ఏడాదికి 8.20శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఏక మొత్తంలో దీనిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 30లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి కూడా మీకు ప్రభుత్వ హామీ ఉంటుంది.
పోస్టాఫీస్ స్కీంలు..
రిస్క్ అస్సలు ఉండ కూడదు.. ప్రభుత్వ మద్దతు కూడా ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. పోస్టల్ శాఖ అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తోంది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీఓఎంఐఎస్ ఆర్డీ వంటివి ఉన్నాయి. ఈ పథకాలలో కచ్చితమైన రాబడి ఉంటుంది. పైగా కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ట్రెజరీ బిల్లులు..
భారత ప్రభుత్వం ఈ ట్రెజరీ బిల్లులు(టీ-బిల్లులు) జారీ చేస్తుంది. ఒక సంవత్సరం కాల వ్యవధికి పెట్టుబడి సేకరించడం దీని ఉద్దేశం. అయితే దీనిలో రాబడి తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి రిస్క్ ఫ్రీ పెట్టుబడి పథకం.
ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్లు..
సేవింగ్ బాండ్లు కూడా రిస్క్ రహిత పెట్టుబడి పథకమే. ఈ స్కీంను 2020 జూలైలో ఆర్బీఐ తీసుకొచ్చింది. ఈ బాండ్లపై ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే మనం తీసుకునే బాండ్లపై వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. అర్ధ వార్షిక ప్రాతిపదికన వడ్డీని ఇవి అందిస్తాయి.
మనీ మార్కెట్ ఫండ్స్(ఎంఎంఎఫ్)..
డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్లు, పెట్టుబడికి సంబంధించి స్థిరమైన రాబడులను అందిస్తాయి. వీటిని స్పల్పకాలిక రుణ నిధులు అని కూడా అంటారు. ఎంఎంఎఫ్లు సుమారు12 నెలల సగటు మెచ్యూరిటీ వ్యవధితో లభిస్తాయి. దీనిలో కొంత రిస్క్ ఉన్నా.. అది చాలా పరిమితంగానే ఉంటుంది.
మునిసిపల్ బాండ్లు..
ప్రభుత్వ మద్దతు ఉండే ఈ బాండ్లకూడా చాలా సురక్షితమైనవి. దేశంలోని మునిసిపల్ కార్పొరేషన్లు లేదా వాటి అనుబంధ సంస్థలు జారీ చేసే ఈ బాండ్ల ద్వారా వచ్చే నిధులతో ఆయా సంస్థలు వంతెనలు, పాఠశాలలు, ఆస్పత్రులను నిర్మించడం, ఇంకా తమ పరిధిలకి చెందిన ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించడం కోసం ఉపయోగిస్తాయి. మీరు పెట్టే పెట్టుబడికి తగిన విధంగా వడ్డీతో సహా చెల్లిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..