Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో మెచ్యూరిటీకి ముందే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించిన పథకం. పూర్తి ప్రభుత్వ రక్షణతో కూడిన పథకం. తల్లిదండ్రులు తమ కుమార్తె..
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించిన పథకం. పూర్తి ప్రభుత్వ రక్షణతో కూడిన పథకం. తల్లిదండ్రులు తమ కుమార్తె పేరు మీద ఈ పొదుపు పథకాన్ని ప్రారంభించి, అందుతో డిపాజిట్ చేస్తుంటే మంచి లాభాన్ని పొందవచ్చు. ఈ మొత్తాన్ని కూతురి చదువుకు లేదా పెళ్లికి వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకం (SSY) వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ. 250తో కుమార్తె పేరు మీద ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. 10 సంవత్సరాల వయస్సు వరకు కుమార్తె పేరు మీద ఈ ఖాతా (Account)ను తెరవవచ్చు. ఖాతాలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు.
సుకన్య సమృద్ధి యోజనలో డిపాజిట్ చేసిన డబ్బును ఎప్పుడు, ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు, ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు అనే ప్రశ్నలు చాలా మందిలో తరచుగా తలెత్తతుంటాయి. నిబంధనల ప్రకారం.. కుమార్తెకు 18 సంవత్సరాలు నిండినప్పుడు లేదా ఆమె 10వ తరగతి పాస్ అయినప్పుడు, ఆమె ఖాతా నుండి డబ్బును తీసుకోవచ్చు. ఖాతాలో జమ చేసిన మొత్తం బ్యాలెన్స్‌లో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి సుకన్య సమృద్ధి ఖాతా నుంచి ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చునని పోస్టాఫీసు నిబంధనలు చెబుతున్నాయి. ఒక సంవత్సరంలో ఒక వాయిదా మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి 5 సంవత్సరాల పాటు మాత్రమే వాయిదాలలో అనుమతించబడుతుంది.
మెచ్యూరిటీకి ముందు ఖాతాను ఎలా మూసివేయాలి?
సుకన్య సమృద్ధి యోజనలో మెచ్యూరిటీకి ముందే ఖాతాను మూసివేసే సదుపాయం అందుబాటులో ఉంది. ఖాతాను ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత, మీరు దానిని మూసివేసి, డిపాజిట్ చేసిన డబ్బును తీసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ఖాతాదారుడు మరణిస్తే ఖాతాను మూసివేయవచ్చు. కొన్ని ప్రతికూల పరిస్థితులలో ఖాతాను మూసివేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఖాతాదారుడి కుమార్తె ప్రాణాంతక అనారోగ్యంతో ఉంటే, ఖాతాను నడుపుతున్న సంరక్షకుడు మరణిస్తే ఖాతాను మూసివేయవచ్చు. అటువంటి పరిస్థితిలో ఖాతాను మూసివేయడానికి అన్ని పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతా నడుస్తున్న పోస్టాఫీసులో దరఖాస్తును సమర్పించడం ద్వారా ఖాతాను మూసివేయడానికి అభ్యర్థన ఇవ్వాలి.
మెచ్యూరిటీలో ఖాతాను ఎలా మూసివేయాలి?
మెచ్యూరిటీ తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా మూసివేయబడుతుంది. దీని మెచ్యూరిటీ 21 ఏళ్లలో ఉంటుంది. కూతురి పెళ్లి సమయంలో కూడా పూర్తి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. కుమార్తె వయస్సు 18 సంవత్సరాలు దాటితే, మీరు వివాహం కోసం పథకం పూర్తి డబ్బు తీసుకోవచ్చు. పెళ్లికి ఒక నెల ముందు లేదా పెళ్లి తేదీ నుండి 3 నెలల తర్వాత ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చు.
21 సంవత్సరాల తర్వాత మీకు ఎంత డబ్బు వస్తుంది?
ఉదాహరణకు 2020లో ఆడపిల్ల పుట్టిందనుకుందాం. అదే ఏడాది కూతురు పేరు మీద ఆమె తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించారు. ఈ ఖాతా 21 సంవత్సరాల తర్వాత అంటే 2041లో మెచ్యూర్ అవుతుంది. ప్రతి సంవత్సరం రూ.లక్ష పెట్టుబడి పెడతారు. పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు అనుకుందాం. 15 ఏళ్లు పూర్తయ్యే నాటికి 15 లక్షలు యాడ్ అవుతాయి. ఒక సంవత్సరం వడ్డీ రేటును 7.6%గా నిర్ణయించినట్లయితే, 21 సంవత్సరాల ముగింపులో రూ. 3,10,454.12 వడ్డీగా కలుపుతారు. దీని ప్రకారం.. 21 సంవత్సరాల ముగింపులో మెచ్యూరిటీ విలువగా కుమార్తె ఖాతాలో రూ.43,95,380.96 జమ చేయబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి