సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఆ సందర్భం నుంచి బయటకు తీసి, తప్పుగా అన్వయించారని సోనికా అభిప్రాయపడ్డారు. కంపెనీలో జరిగిన అంతర్గత చర్చల్లో ఆయన ఎన్నడూ 90 గంటల పనివిధానాన్ని తప్పనిసరి చేయాలని కోరడం గానీ, సూచించడం గానీ చేయలేదన్నారు. ఆయన మాటల వెనుక ఉద్డేశం పని సమయాన్ని పెంచడం కాదని, నిజమైన ఉద్దేశాన్ని పక్కన పెట్టి, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారన్నారు. ఆ సంస్థతో తనకు ఐదు సంవత్సరాల అనుబంధం ఉందని సోనిక తెలిపారు. ఉద్యోగులకు మద్దతు ఇవ్వడంలో సుబ్రహ్మణ్యన్ ఎల్లప్పడూ ముందు ఉంటారన్నారు.
ఉద్యోగులను తన కుటుంబంలా ఆయన భావిస్తారని, ఐక్యతా భావాన్ని పెంచేలా వ్యవహరిస్తారన్నారు. ఆయన ప్రకటన వెనుక ఉన్న సందర్భం, ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలను కోరారు. కాగా.. ఎల్ అండ్ టీ హెచ్ ఆర్ అధిపతి సోనికా పెట్టిన పోస్టుపై కొందరు నెటిజన్లు స్పందించారు. వారిలో కొందరు వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. కుటుంబంతోనే సమయం గడపలేకపోయిన వ్యక్తి.. కార్పొరేట్ కుటుంబంలో ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. వివాదం ముదరకుండా ఉండేందుకు సోనికా రంగంలోకి దిగారని మరికొందరు అన్నారు.
ఇటీవల జరిగిన అంతర్గత చర్చల్లో సుబ్రహ్మణ్యన్ తన సిబ్బందిత మాట్లాడారు. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించారు. ఆదివారాలు కూడా పనిచేస్తే బాగుంటుందని అంటూనే.. ఎంత సేపు మీ భార్యల వంక చూస్తారు అంటూ చమత్కరించారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. భారతీయ వ్యాపార వేత్తలు ఎక్కువ పని గంటలపై వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో దీనిపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. 2023లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు, భారతీయులు వారానికి 70 గంటలు పనిచేస్తే దేశం ప్రగతి పథంలో నడుస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో విపరీతంగా ట్రోల్ అయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి