రూ.2000 నోటు చెల్లుబాటు..! ఇంకా చెలామణిలో రూ.5,817 కోట్లు విలువైన నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, రూ. 5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా చెలామణిలో ఉన్నాయి. 2023 మే 19న ఉపసంహరణ ప్రకటించినప్పటికీ, ఈ నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతున్నాయి. 98.37 శాతం నోట్లు ఇప్పటికే తిరిగి వచ్చాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం విడుదల చేసిన డేటా ప్రకారం.. రూ.5,817 కోట్ల విలువైన అధిక విలువ గల రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి. 2023 మే 19న ఆర్బీఐ చెలామణి నుండి రూ.2,000 డినామినేషన్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ, ఇంకా 2,000 రూపాయల నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతున్నాయి.
మే 19, 2023న కరెన్సీ నోటు ఉపసంహరణ ప్రకటించే నాటికి రూ.3.56 లక్షల కోట్ విలువైన రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31, 2025న వ్యాపారం ముగిసే సమయానికి రూ.5,817 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. ఉపసంహరణ కారణంగా చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.37 శాతం తిరిగి వచ్చాయి అని ఆర్బీఐ వెల్లడించింది.
2,000 రూపాయల నోట్లను మార్చుకునే సౌకర్యం మే 19, 2023 నుండి 19 RBI కార్యాలయాలలో అందుబాటులో ఉంది. 2023 అక్టోబర్ 9 నుండి RBI కార్యాలయాలు వ్యక్తులు/సంస్థల నుండి వారి బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయడానికి రూ.2,000 నోట్లను కూడా అంగీకరిస్తున్నాయి. ఇంకా ప్రజలు దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా ఇండియా పోస్ట్ ద్వారా రూ.2,000 నోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి RBI జారీ కార్యాలయాలలో దేనికైనా పంపవచ్చు.
కార్యాలయాలు అహ్మదాబాద్ , బెంగళూరు , బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో , ముంబై , నాగ్‌పూర్, న్యూఢిల్లీ , పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ఉన్నాయి. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ స్థితిని RBI కాలానుగుణంగా వెల్లడిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




