5 ఏళ్లుగా ఒకే జాబ్ చేస్తున్నారా? అయితే మీరు ఏం నష్టపోతున్నారో తెలుసా?
ఒకే ఉద్యోగంలో సంవత్సరాల పాటు కొనసాగుతూ నైపుణ్యాలను పెంపొందించుకోకపోతే, ద్రవ్యోల్బణం కారణంగా ఆదాయ వృద్ధి తగ్గి ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉందని CA నితిన్ కౌశిక్ హెచ్చరిస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, వ్యూహాత్మకంగా ఉద్యోగ మార్పులు చేయడం కెరీర్ వృద్ధికి కీలకమని ఆయన సూచించారు.

ఒకే ఉద్యోగంలో చాలా సంవత్సరాలు కొనసాగడం ఉద్యోగ భద్రతను ఇస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే దీర్ఘకాలం ఒకే స్థాయిలో కొనసాగడం ఆర్థిక భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల మధ్య కేవలం సాధారణ వార్షిక జీతాల పెంపుపై ఆధారపడటం సరిపోదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టుల్లో కౌశిక్ “లాయల్టీ ట్యాక్స్” అనే భావనను ప్రస్తావించారు. ఉద్యోగంపై విధేయతతో సంవత్సరాల పాటు ఒకే సంస్థలో కొనసాగుతున్న ఉద్యోగులు, తమ మార్కెట్ విలువను పెంచుకోకపోతే ఆర్థికంగా వెనుకబడే ప్రమాదం ఉందని తెలిపారు.
టైర్-1 నగరాల్లో విద్య, ఆరోగ్యం, గృహ ఖర్చులు 12 శాతం నుంచి 14 శాతం వరకు పెరుగుతున్నప్పటికీ, చాలామంది ఉద్యోగుల జీతాలు అంత స్థాయిలో పెరగడం లేదని ఆయన అన్నారు. మీ ఆదాయం సంవత్సరానికి కనీసం 15 శాతం పెరగకపోతే, మీరు వాస్తవానికి ప్రతి నెలా మరింత పేదవారవుతున్నారు అని కౌశిక్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఉద్యోగులు తమ నైపుణ్యాలను కూడా నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
2023లో చేసిన పనినే 2026లో కూడా చేస్తుంటే, కెరీర్ పురోగతికి అవకాశాలు తగ్గిపోతాయని ఆయన అన్నారు. సంస్థలు ఉద్యోగుల అనుభవం కంటే, వారు పరిష్కరించగల సమస్యల క్లిష్టతను ఎక్కువగా పరిగణిస్తున్నాయని తెలిపారు. ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు వంటి అంశాల్లో పరిజ్ఞానం పెంపొందించుకోవడం అవసరమని సూచించారు. అదేవిధంగా వ్యూహాత్మకంగా ఉద్యోగ మార్పులు చేయడం కూడా ఆదాయ వృద్ధికి కీలకమని కౌశిక్ అభిప్రాయపడ్డారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ మార్కెట్ విలువను అంచనా వేసుకోవాలని, లేదంటే కెరీర్ మొత్తంలో భారీ ఆదాయ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
