Silver: బిగ్ షాక్.. రూ.లక్షన్నరకు వెండి..! వారికి మాత్రం మస్త్ లాభాలు..
వెండి పెట్టుబడిదారులకు ఇది నిజంగా పండుగ సమయం. 2025లో వెండి అంచనాలకు మించి దూసుకెళ్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి దాదాపు 37శాతం లాభాన్ని నమోదు చేసింది. వెండి ధరలు భవిష్యత్తులో రూ. 1,50,000 వరకు చేరవచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు దూకుడుగా పెరుగుతున్నాయి. ఈ జోరు భవిష్యత్తులో మరింత పెరిగి కిలో వెండి ధర ఏకంగా రూ.1.5 లక్షల స్థాయికి చేరవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, సరఫరాలో ఉన్న కొరత, వాణిజ్యపరమైన ఒత్తిళ్లు వెండి ధరకు ప్రధానంగా ఊతమిస్తున్నాయని ఆ సంస్థ పేర్కొంది.
పెరుగుదల ప్రధాన కారణం
వెండి ధరల పెరుగుదలకు ప్రధానంగా పారిశ్రామిక రంగం నుండి వస్తున్న బలమైన డిమాండ్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ రంగాలలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. 2025 సంవత్సరంలో మొత్తం వెండి ఉత్పత్తిలో దాదాపు 60 శాతం పారిశ్రామిక అవసరాలకే వినియోగించబడుతుందని MOFSL నివేదిక వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల విధానాల్లోని అనిశ్చితి కారణంగా మదుపరులు బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా చూస్తున్నారు. దీనికి తోడు సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్, రష్యా వంటి దేశాలు తమ నిల్వలను పెంచుకునేందుకు భారీగా వెండిని కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ వెండి ETFలలో 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు భారత్.. 3,000 టన్నుల కంటే ఎక్కువ వెండిని దిగుమతి చేసుకోవడం, పెట్టుబడిదారుల విశ్వాసం ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తోంది.
పెట్టుబడిదారులకు లాభాల పంట
ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి ధర ఏకంగా 37 శాతం పెరిగింది. గతంలో రూ.1,11,111, రూ.1,25,000 లక్ష్యాలను చేరుకున్న వెండి.. ఇప్పుడు రూ.1,35,000 స్థాయిని అధిగమించి, దీర్ఘకాలంలో రూ.1,50,000 మార్కును తాకే అవకాశం ఉందని MOFSL అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.88.5గా ఉన్నప్పుడు ఈ అంచనాలు వర్తిస్తాయని నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో పెట్టుబడిదారులకు ఈ బ్రోకరేజ్ సంస్థ ఒక ముఖ్యమైన సలహా ఇచ్చింది. వెండి ధర రూ.1,04,000 నుంచి రూ.1,08,000 మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుందని, 12 నుంచి 15 నెలల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చని సూచించింది.
తగ్గిన సరఫరా, పెరిగిన డిమాండ్
వరుసగా ఐదో సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా డిమాండ్ కంటే తక్కువగా ఉంది. ఇది ధరల పెరుగుదలకు ఒక ముఖ్య కారణం. ఈ సంవత్సరం ఆభరణాల డిమాండ్ 6 శాతం వరకు తగ్గుతుందని నివేదిక పేర్కొన్నప్పటికీ, పారిశ్రామిక పెట్టుబడి డిమాండ్ బలంగా ఉండటంతో ధరల పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా వెండి ఇప్పుడు కేవలం ఒక ఆభరణంగా కాకుండా, పారిశ్రామికంగా, ఆర్థిక భద్రత పరంగా ఒక ముఖ్యమైన లోహంగా నిలుస్తోంది. భవిష్యత్తులో దాని ధరలు కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




