Petrol Diesel Price: కేంద్రం బాటలోనే ఆ రాష్ట్రాలు.. ఎంత మేర ఇంధన ధరలు తగ్గించాయంటే..?
Petrol Diesel Price: గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రో ధరలు వినియోగదారుల జేబుకు భారీ చిల్లు పెడుతున్నాయి. దీంతో వారికి కొంత ఊరట ఇచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
Petrol Diesel Price: గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రో ధరలు వినియోగదారుల జేబుకు భారీ చిల్లు పెడుతున్నాయి. దీంతో వారికి కొంత ఊరట ఇచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. వినియోగదారులకు మరింత ఉపశమనం కల్పించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు మేరకు మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళతో పాటు మరిన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.9.50, డీజిల్ పై లీటరుకు రూ.7 వరకు తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. అయితే వివిధ రాష్ట్రాల్లో విధించి వ్యాట్, ఇతర టాక్స్ లకు అనుగుణంగా రేట్లు మారనున్నాయి.
మహారాష్ట్ర:
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌ను తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500 కోట్ల నష్టం కలుగుతుందని అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించిన తర్వాత పెట్రోల్‌పై నెలకు వచ్చే ఆదాయం రూ.80 కోట్లు, డీజిల్‌పై రూ.125 కోట్లు తగ్గుతుందని తెలుస్తోంది.
రాజస్థాన్:
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లీటర్ పెట్రోల్‌పై రూ. 2.48 మరియు డీజిల్‌పై రూ. 1.16 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత రాజస్థాన్ ప్రభుత్వం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో లీటరుకు పెట్రోల్ రూ.10.48, డీజిల్ రూ.7.16 మేర తగ్గనున్నాయి.
కేరళ:
కేంద్రం ఇంధన ధరలను తగ్గించిన తర్వాత కేరళ ప్రభుత్వం శనివారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2.41, లీటర్ డీజిల్ పై రూ. 1.36 తగ్గింపును ప్రకటించింది.
ఒడిశా:
ఇదే సమయంలో ఒడిశా ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.2.23, లీటరు డీజిల్‌పై రూ.1.36 వ్యాట్‌ను తగ్గించింది. అయితే అతి త్వరలోనే దేశంలోని మిగిలిన రాష్ట్రాలు సైతం ఇంధన ధరలను తగ్గించి వారి రాష్ట్రాల్లోని ప్రజలకు స్వాంతన కలిగిస్తాయని తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంత మేర ఊరట లభిస్తుంది అనే విషయం తెలియాల్సి ఉంది.