Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2023: కొత్త సంవత్సరంలో డబ్బును ఆదా చేయాలనుకుంటున్నారా..? ఈ చిట్కాలు పాటించండి

కొత్తగా ఉండే ఏదైనా సరే మనల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొత్త అనే పదం వింటేనే మనసు ఒకరకమైన సంతోషాన్ని నింపుకుంటుంది. అది కొత్త బట్టలైనా.. కొత్తగా కొన్న..

New Year 2023: కొత్త సంవత్సరంలో డబ్బును ఆదా చేయాలనుకుంటున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
Business Idea
Follow us
Subhash Goud

|

Updated on: Dec 29, 2022 | 8:24 PM

కొత్తగా ఉండే ఏదైనా సరే మనల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొత్త అనే పదం వింటేనే మనసు ఒకరకమైన సంతోషాన్ని నింపుకుంటుంది. అది కొత్త బట్టలైనా.. కొత్తగా కొన్న వాస్తువైనా.. కొత్తగా వచ్చిన సినిమా లేదా టీవీ షో అయినా ఏదైనా సరే కొత్తది అంటే ఉండే ఆసక్తి అద్భుతంగా ఉంటుంది. ఇక కొత్త సంవత్సరం అంటే అబ్బో.. దాని గురించి చెప్పనక్కర్లేదు. డిసెంబర్ నెల మొదలైందంటే చాలు.. పాత సంవత్సరం ఎప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూస్తాం. కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూపుల్లో పడిపోతాం.

కొత్త సంవత్సరం వస్తోంది అంటే.. కొత్త నిర్ణయాలు తీసుకుని.. ఈ సంవత్సరం నుంచి ఇది చేయను. ఇలా ఉండను.. అని అందరూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విపరీతంగా పొగ తాగేవారు.. మద్యం సేవించే వారు జనవరి 1 నుంచి ఈ అలవాట్లు వదిలేస్తాం అని డిసెంబర్ మొదటి నుంచి అందరికీ చెబుతూ వస్తారు. నిజంగా మానేస్తారో లేదో అనేది వేరే విషయం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అయితే చాలా మంది తాము తీసుకున్న కొత్త నిర్ణయాలను కచ్చితంగా అమలు చేస్తారు. జీవితంలో తాము అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువగా ఇలా తీసుకునే నిర్ణయాలన్నీ తమ అలవాట్లు.. లేదా చదువు.. లేదా కెరీర్ కి సంబంధించినవే ఉంటాయి. మనల్ని ఆడించే డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రత్యేకంగా ఏ కొత్త నిర్ణయం తీసుకోం. ఇంకా చెప్పాలంటే డబ్బు గురించి పెద్దగా ఆలోచించం. కానీ.. డబ్బు చుట్టూ తిరిగే ప్రపంచంలో మన డబ్బుకు సంబంధించి కచ్చితంగా కొత్త సంవత్సరంలో సరికొత్త విధంగా వ్యవహరించడం ద్వారా భవిష్యత్ లో డబ్బు చింత లేకుండా జీవించే అవకాశం పొందవచ్చు. ఇప్పుడు ఏ విధంగా కొత్త సంవత్సరంలో మనీ మేనేజ్మెంట్ కు సమబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు? వాటిని ఏలా అమలు చేయవచ్చు అనే అంశాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పడు ఏ ఆర్థిక అలవాట్లను మనం వదిలేసుకుంటే మంచిది అనే విషయం గురించి వివరంగా చెప్పుకుందాం.

ఖర్చు చేసే ముందే పొదుపు చేయడం.. అవును మనం అందరం చేసే పెద్ద తప్పు ఖర్చు చేయగా మిగిలిన డబ్బును పొదుపు చేద్దాం అని అనుకోవడం. దీంతో మనకు ప్రతి సారీ ఏదో ఒక ఖర్చు వచ్చి మీద పడుతూనే ఉంటుంది.. మన పొదుపు ప్రణాళికను వాయిదా వేసే పరిస్థితి వస్తూనే ఉంటుంది. అందుకే.. ఈ కొత్త సంవత్సరం మొదటి నెల జనవరి నుంచే మన ఆదాయం నుంచి కొంత శాతం పొదుపు చేసిన తరువాత మిగిలిన డబ్బునే ఖర్చు చేయాలనే నియమ పెట్టుకుందాం. మొదట్లో ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. దీని కోసం ఒక పని చేయవచ్చు. మనకి పది వేల రూపాయల ఆదాయం వస్తుందని అనుకుందాం. అందులో కనీసం వెయ్యి రూపాయలు సేవింగ్స్ కోసం పక్కన పెట్టేసి.. కేవలం 9 వేలు మాత్రమే మన సంపాదన అని అనుకోవడం ప్రారంభిస్తే కచ్చితంగా సేవింగ్స్ విషయంలో మనం ఒక పెద్ద ముందడుగు వేయగలుగుతాం.

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా కాస్త ఆలోచిద్దాం

ఎమర్జెన్సీ ఫండ్ గురించి చాలా ఉదాసీనంగా మనం వ్యవహరిస్తాం. ఎందుకంటే.. కష్టం వచ్చినపుడు కదా చూసుకుందాంలే అనుకుంటాం. కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎటువంటి ముప్పు ముంచుకు వస్తుందో తెలీదు. ప్రపంచంలో ఘర్షణ వాతావరణం పెరిగిపోయింది. ఆర్ధిక మాంద్యం ముప్పు మన వాకిట్లో నిలబడి ఉంది.. అందువల్ల కచ్చితంగా అత్యవసరాల కోసం కొంత డబ్బు పక్కన ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఆరు నెలలు వీలు కాకపోతే మూడు నెలలు సంపాదన నిలిచిపోయినా మన ఈఎంఐలు.. అద్దెలు.. ఇతర అవసరాలకు ఇబ్బంది రాని విధంగా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం ఈ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే చక్కని ప్రణాళికా వేసుకుని దానిని అమలు చేయడం ప్రారంభిద్దాం..

ఇప్పుడు కొనండి తరువాత పే చేయండి మాయలో పడిపోవద్దు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది. పే లేటర్ విధానం మన బడ్జెట్ తల్లకిందులు చేస్తుంది. ఒక్కోసారి అవసరం లేకపోయినా ఏదో ఒక ఖర్చు.. ఈ విధానం వలన చేసేస్తాం. అందుకే కొత్త సంవత్సరంలో అత్యవసరం అయితే తప్ప ఈ విధానాన్ని వినియోగించుకోకూడదనే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుందాం. దానిని కచ్చితంగా అమలు చేద్దాం.

ప్రకటనల మోజులో కొట్టుకుపోవడం మానేద్దాం. మన చేత కొనిపించడమే వ్యాపార ప్రకటనల లక్ష్యం. అందుకోసం ఎంతో ఆకర్షణీయమైన వలలు విసురుతారు వ్యాపారులు. అందువల్ల మనం ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. ఏదైనా వస్తువు అవసరం అనుకుంటేనే కొనాలనే నిర్ణయం కచ్చితంగా తీసుకోవాలి. ఆకర్షణీయంగా కనిపించిన ప్రకటన చూసి చాలా బావుంది అని సంబర పడాలి అంతే. మంచి సినిమా సీన్ చూసి ఎలా ఆహ్లాదం పొందుతామో మంచి వ్యాపార ప్రకటన చూసి కూడా అంతే ఆహ్లాదంగా వ్యవహరించాలి. అంతే కానీ ప్రకటనలో కనిపించిన వస్తువు బావుందని దానిని కొనేయాలనే ఆలోచన వచ్చే సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదనే గట్టిగా నిర్ణయం తీసుకుందాం.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి