AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు ఇది తెలుసుకోవాలి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

పాన్ కార్డ్ వాడుతున్నారా..? అయితే ఏప్రిల్ 1 నుండి మారబోతున్న కొత్త నిబంధనల గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నగదు డిపాజిట్ల నుంచి ఆస్తి కొనుగోళ్ల వరకు, వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి హోటల్ బిల్లుల వరకు.. ఆదాయపు పన్ను శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మార్చి 31 లోపు మీరు పూర్తి చేయాల్సిన పనులు ఏమిటి? కొత్త రూల్స్ వల్ల సామాన్యులకు కలిగే లాభనష్టాలేంటి? తెలుసుకుందాం..

PAN Card: పాన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు ఇది తెలుసుకోవాలి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?
New Pan Card Rules From April 1
Krishna S
|

Updated on: Mar 22, 2026 | 5:46 PM

Share

ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు నిబంధనలలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్ ద్వారా పాన్ పొందే సులభతర ప్రక్రియకు 2026 మార్చి 31 చివరి అవకాశం కానుంది. ప్రస్తుతం కేవలం ఆధార్ కార్డు ద్వారానే పాన్ కార్డు పొందే వెసులుబాటు ఉంది. అయితే ఏప్రిల్ 1 నుండి ఈ నిబంధన మారనుంది. ఏప్రిల్ 1 నుండి కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసేవారు పుట్టిన తేదీ రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, ఓటరు కార్డు, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ వంటి అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుండి పాత పాన్ ఫామ్‌లు చెల్లవు. కొత్త ఫార్మాట్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం, పాన్ కార్డుపై పేరు ఇకపై పూర్తిగా ఆధార్‌లోని వివరాల ప్రకారమే ఉంటుంది. కార్డుపై ఉన్న ఇతర పేర్ల గుర్తింపులు తొలగించబడతాయి.

ఆర్థిక లావాదేవీల్లో కీలక మార్పులు

కొత్త నిబంధనల ప్రకారం నగదు డిపాజిట్లు, వాహనాల కొనుగోలు, ఇతర లావాదేవీల పరిమితుల్లో మార్పులు చేశారు..

నగదు డిపాజిట్ పరిమితి:

ప్రస్తుతం రోజుకు రూ. 50,000 డిపాజిట్ చేస్తే పాన్ అవసరం. కానీ కొత్త రూల్ ప్రకారం, రోజువారీ పరిమితి బదులు వార్షిక పరిమితి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి రూ. 10 లక్షలు దాటితే పాన్ వివరాలు తప్పనిసరి.

వాహనాల కొనుగోలు – అమ్మకం

ఇప్పటివరకు ఏ వాహనం కొన్నా పాన్ అడిగేవారు. ఏప్రిల్ 1 నుండి వాహనం విలువ రూ.5 లక్షలు దాటితేనే పాన్ కార్డు అవసరం. ద్విచక్ర వాహనదారులకు ఇది ఊరటనిచ్చే అంశం.

హోటల్ బిల్లులు – రెస్టారెంట్లు

హోటల్ చెల్లింపుల పరిమితిని రూ. 50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు. అంటే లక్ష రూపాయల లోపు బిల్లులకు పాన్ వివరాలు ఇవ్వక్కర్లేదు.

రియల్ ఎస్టేట్

ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో ప్రస్తుతం ఉన్న రూ. 10 లక్షల పరిమితిని రూ.20 లక్షలకు రెట్టింపు చేయనున్నారు. 20 లక్షల పైబడిన లావాదేవీలకే పాన్ తప్పనిసరి అవుతుంది.

ఇన్సూరెన్స్ ప్రీమియం

భీమా పాలసీల ప్రీమియం చెల్లింపులు మరియు కంపెనీలతో జరిపే విస్తృత లావాదేవీలకు కూడా పాన్ అనుసంధానం మరింత కఠినతరం కానుంది.

ఎందుకు ఈ మార్పులు?

పన్ను ఎగవేతను అరికట్టడం మరియు అధిక విలువ గల లావాదేవీలను సమర్థవంతంగా పర్యవేక్షించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పౌరులు తమ ఆర్థిక కార్యకలాపాలను పారదర్శకంగా ఉంచుకోవడానికి ఈ మార్పులు దోహదపడతాయని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. మీరు ఇంకా పాన్ కార్డు పొందకపోయినా లేదా ఏవైనా మార్పులు చేసుకోవాలనుకున్నా, మార్చి 31 లోపు పూర్తి చేయడం ఉత్తమం. ఏప్రిల్ 1 నుండి ప్రక్రియ మరింత భారంగా మరియు అదనపు పత్రాలతో కూడుకుని ఉంటుంది.

Follow Us