రన్నింగ్ ట్రైన్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చు! ఎక్కడో కాదు మన దేశంలోనే..
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) తన నమో భారత్ రైళ్లు, స్టేషన్లలో వేడుకలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు అనుమతినిచ్చింది. గంటకు రూ.5,000 నుండి ప్రారంభమయ్యే బుకింగ్‌లతో, వ్యక్తిగత, కార్పొరేట్ ఈవెంట్లకు ఇది అందుబాటులో ఉంది. ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు వేడుకలు చేసుకోవచ్చు.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) తన నమో భారత్ రైళ్లు, స్టేషన్స్‌లో సెలబ్రేషన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కొత్త విధానం ప్రకారం.. వ్యక్తులు, ఈవెంట్ నిర్వాహకులు, ఫోటోగ్రఫీ లేదా మీడియా కంపెనీలు స్టాటిక్ లేదా రన్నింగ్ నమో భారత్ కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నమో భారత్ అనేది NCR లోని ప్రాంతీయ నోడ్‌లను అనుసంధానించే కొత్త, అంకితమైన, అధిక-వేగం, అధిక-సామర్థ్యం, సౌకర్యవంతమైన కమ్యూటర్ సర్వీస్. ఇది సాంప్రదాయ రైల్వే నుండి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రూట్‌లో మాత్రమే తిరుగుతుంది. పాయింట్-టు-పాయింట్ ప్రాంతీయ ప్రయాణం, తక్కువ స్టాప్‌లతో, అధిక వేగంతో ఉంటుంది.
స్టాటిక్ షూట్‌ల కోసం దుహై డిపోలో ఒక మాక్-అప్ కోచ్‌ను కూడా అందుబాటులో ఉంచారు. బుకింగ్‌లు గంటకు రూ.5,000 నుండి ప్రారంభమవుతాయి. సెటప్, డిస్‌మౌంటింగ్ కోసం ఒక్కొక్కటి అదనంగా 30 నిమిషాలు లభిస్తాయని NCRTC తెలిపింది.ఈ చొరవ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందని, నమో భారత్ ఆధునిక, అంతర్జాతీయంగా రూపొందించిన కోచ్‌లు ఫొటోలు, సమావేశాలకు ఆకర్షణీయమైన నేపథ్యాన్ని అందిస్తాయని కార్పొరేషన్ తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం లిమిటెడ్‌గా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు.
సెలబ్రేషన్స్‌ను ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చేసుకోవచ్చు. రైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించకూడదు లేదా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదు. భద్రత, కార్యాచరణ ప్రోటోకాల్‌లను పాటించడానికి అన్ని కార్యకలాపాలు NCRTC సిబ్బంది, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపింది. ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్ సౌత్ వంటి కీలక ప్రదేశాలలో స్టేషన్లు ఉన్నందున, ఈ చొరవ ఢిల్లీ-మీరట్ కారిడార్ అంతటా నివాసితులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
