
మీరు రైల్లో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే మీరు ట్రైన్ బయల్దేరే సమయానికి రైల్వే స్టేషన్‌కు చేరుకోలేక రైలు మిస్సయ్యారు. ఇలాంటి సమయంలో రిజర్వ్ చేసుకున్న టిక్కెట్ ఏమి చేయాలి? మీరు ఆ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణించవచ్చా? లేదా రీఫండ్ పొందవచ్చా..? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. వీటి గురించి రైల్వేశాఖ నిబంధనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ప్రతి టిక్కెట్టు ఒక నిర్దిష్ట రైలు, తేదీ, తరగతి ప్రయాణానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీరు బుక్ చేసుకున్న రైలు మిస్ అయితే.. సాధారణంగా అదే టిక్కెట్టుపై మరో రైలులో ప్రయాణించడానికి అనుమతి లేదు. రిజర్వుడ్ టిక్కెట్ హోల్డర్లకు ఈ నియమం కఠినంగా అమలు చేస్తారు. మీరు ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్ లేదా ఏసీ టిక్కెట్ బుక్ చేసుకున్నారనుకుందాం. ఆ రైలు మిస్ అయితే.. అదే టిక్కెట్టుపై మరో ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లడం కుదరదు. టిక్కెట్టు ఉంది కదా అని ఏ రైలులోనైనా వెళ్లవచ్చని చాలామంది భావిస్తుంటారు. కానీ రైల్వేశాఖ నిబంధనలు అందుకు అనమతించవు
ఇక జనరల్ టిక్కెట్ల విషయంలో రూల్స్ మరోలా ఉన్నాయి. ముందుగా రిజర్వు చేసుకోకుండా రైల్వే స్టేషన్ కౌంటర్ లేదా రైల్ వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడు జనరల్ టిక్కెట్ తీసుకుంటే అదే మార్గంలో ఇతర రైళ్లలో లేదా జనరల్ కోచ్‌లు ఉన్న రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంది. కానీ అది కూడా టిక్కెట్‌పై ఉన్న తేదీ, గమ్యస్థానంపై ఆధారపడి ఉంటుంది. ఒక జనరల్ టిక్కెట్ సుమారు 3 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అందువల్ల మీరు అదే రోజున లేదా అనుమతించబడిన సమయంలోపు మరో రైలు ఎక్కితే ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కనెక్టింగ్ రైలు ఆలస్యం కారణంగా తదుపరి రైలును మిస్సయితే.. మీరు స్టేషన్ అధికారులను సంప్రదించవచ్చు. అదే PNR నంబర్‌పై కనెక్టింగ్ ప్రయాణం ఉన్నట్లయితే లేదా ఆలస్యం రైల్వేల కారణంగా జరిగినట్లయితే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశముంటుంది.
రైలు మిస్సవ్వకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణానికి కనీసం 30 నుండి 45 నిమిషాల ముందుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ముందుగానే ప్లాట్‌ఫాం నంబర్‌ను చూసుకోవడం లేదా యాప్‌ల ద్వారా రైలు స్టేటస్ పర్యవేక్షించడం ద్వారా ఇటువంటి సమస్యలను నివారించవచ్చు.