Gen Z vs Millennials: సిబిల్ స్కోర్‌లో ఎవరు తోపు? యువతలో మారుతున్న ఆర్థిక అలవాట్లు
మిలీనియల్స్ సగటు క్రెడిట్ స్కోర్ Gen Z కంటే కొంత ఎక్కువగా ఉంది. మిలీనియల్స్ స్కోర్ దాదాపు 690 కాగా, Gen Z స్కోర్ 680కి చేరువలో ఉంది. అయితే 2019 నుంచి Gen Z స్కోర్ సగటున 17 పాయింట్లు పెరిగింది. క్రెడిట్ హిస్టరీ, సమయానికి చెల్లింపులు, క్రెడిట్ వినియోగం స్కోర్‌పై ప్రభావం చూపుతాయి.

క్రెడిట్ కార్డులు, లోన్లు, ఆర్థిక లావాదేవీల విషయంలో క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ఎంతో కీలకం. ముఖ్యంగా యువతలో క్రెడిట్‌పై అవగాహన వేగంగా పెరుగుతోంది. తాజాగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మిలీనియల్స్ (30–44 ఏళ్లు) సగటు క్రెడిట్ స్కోర్ విషయంలో జనరేషన్ Z కంటే కొంత ముందంజలో ఉన్నప్పటికీ, జెన్ జీ (18–29 ఏళ్లు) మాత్రం గత కొన్నేళ్లలో స్కోర్‌ను మెరుగుపరుచుకోవడంలో వేగంగా దూసుకెళ్తోంది.
మిలీనియల్స్ సగటు క్రెడిట్ స్కోర్ సుమారు 690 వద్ద ఉన్నట్లు వివిధ డేటా సూచిస్తోంది. జెన్ జీ సగటు స్కోర్ దాదాపు 680గా ఉంది. వయసు పెరిగే కొద్దీ క్రెడిట్ చరిత్ర ఎక్కువ కాలం ఉండటం, రుణాలను సక్రమంగా చెల్లించిన రికార్డు ఏర్పడటం వంటి అంశాలు స్కోర్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందుకే మిలీనియల్స్‌కు కొంత ప్రయోజనం కనిపిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో జెన్ జీ చూపిస్తున్న పురోగతి ప్రత్యేకంగా నిలుస్తోంది. FICO పరిశోధనను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం, 2019 నుంచి జెన్ జీ క్రెడిట్ స్కోర్ సగటున 17 పాయింట్లు పెరిగింది. అంటే వయసులో చిన్నవారైనప్పటికీ, క్రెడిట్ వ్యవస్థను అర్థం చేసుకుని తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడంపై ఈ తరం ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.
క్రెడిట్ స్కోర్ విషయంలో క్రెడిట్ హిస్టరీ టైమ్ కీలకమైన అంశం. పాత ఖాతాలను సక్రమంగా నిర్వహించడం, బిల్లులను సమయానికి చెల్లించడం, క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించడం వంటి అలవాట్లు స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. మరోవైపు అధిక క్రెడిట్ కార్డు బ్యాలెన్సులు, వడ్డీ రేట్లు యువతకు ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇదే సమయంలో జెన్ జీ, మిలీనియల్స్ తరచుగా తమ క్రెడిట్ స్కోర్లను పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే క్రెడిట్‌పై అవగాహన చిన్న వయసులోనే పెరుగుతోంది. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం సగటు స్కోర్‌లో మిలీనియల్స్ ముందున్నప్పటికీ, స్కోర్ మెరుగుదల వేగంలో జెన్ జీ ప్రత్యేకంగా నిలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
