Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లలో మరో కొత్త రూల్.. లగేజీ పరిమితుల్లో మార్పులు.. అంతకంటే ఎక్కువుంటే భారీ జరిమానా
ఈ నెల 17వ తేదీన రైల్వేశాఖ కోల్‌కత్తా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ రైలులో కొత్త రూల్స్‌ను రైల్వేశాఖ అమలు చేస్తోంది. అవేంటో చూద్దాం.

వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కఠిన నియమాలను రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది. టికెట్ బుకింగ్, రీఫండ్, రిజర్వేషన్ కోటాతో పాటు లగేజీకి సంబంధించి కొత్త నియమాలను అమలు చేస్తోంది. ఈ నెల 17న హౌరా-కామాఖ్య మధ్య దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రాంభించారు. ఈ రైలుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలుతో కామాఖ్య-హౌరా మధ్య ప్రమాణ సమయం నాలుగు గంటలు తగ్గింది. కేవలం 14 గంటల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం పూర్తవుతుంది. ఈ రైలులో ప్రవేశపెట్టిన నియమాలు రానున్న వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో కూడా అమలు కానున్నాయి. దీంతో ఈ రైళ్లల్లో ప్రయాణం చేయాలనుకుంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో ఇఫ్పుడు చూద్దాం.
టికెట్ కన్ఫామ్ అయితేనే..
ఈ రైళ్లల్లో వెయింటింగ్, ఆర్‌ఏసీ టికెట్లు ఉన్నవారు ప్రయాణించడానికి వీల్లేదు. కేవలం కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ఇక చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ రాదు. ట్రైన్ బయలుదేరే సమయానికి 8 గంటల్లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి వాపసు రాదు. ఇక 72 గంటల నుంచి 8 గంటల మధ్య చేసుకుంటే 50 శాతం, 72 గంటల ముందు చేసుకుంటే 25 శాతం టికెట్ ఛార్జీలు కట్ చేసి మిగతా సొమ్ము రీఫండ్ చేస్తారు.
వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ ఫ్రీ
ఇందులో ప్రయాణికులకు వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ ఉచితంగా అందిస్తారు. రైల్ నీర్ బ్రాండెడ్ వాటర్ బాటిల్ అందిస్తారు. ఇక ఉదయం టీ, బిస్కెట్ ఇస్తారు. ఇక ఇందులో బెంగాలీ, అస్సాం వంటకాలు వడ్డిస్తారు. టికెట్‌తో పాటు ప్రయాణికులకు ఉచితంగా లంచ్, డిన్నర్ అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
లగేజీ రూల్స్
ఇక వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో లగేజీ పరిమితుల విషయానికొస్తే.. క్లాసులను బట్టి మారుతుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో 70 కిలోల వరకు సామాన్లు తీసుకెళ్లవచ్చు. ఇక సెకండ్ ఏసీలో 50 కిలోలు, థర్డ్ ఏసీలో 40 కిలోల వరకు సామాన్లు తీసుకెళ్లవచ్చు. వీటికి మించి లగేజీ తీసుకెళితే అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ఇక ఈ లిమిట్ దాటి 10 నుంచి 15 కిలోల బరువు గల సామాన్లను తమ వెంట తీసుకెళ్లవచ్చు. వీటికి అదనంగా 1.5 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అదనపు లిమిట్ కూడా దాటి మీరు సామాన్లను తీసుకెళ్లడానికి వీల్లేదు. రైల్వే అధికారులు పట్టుకుంటే మీకు జరిమానా విధిస్తారు. ఎక్కువ లగేజీ తీసుకెళ్లాలంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానా ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.
