OpenAI: ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. ఆరోపణలు చేసిన 3 నెలలకే విగతజీవిగా! ఇంతకీ హత్యా? ఆత్మహత్యా?
చాట్ జీపీటీ సురక్షితం కాదని ఆరోపణలు చేసిన 3 నెలలకే ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో అతడిది హత్యా.. ఆత్మహత్యా? అనే చర్ఛ ముమ్మరంగా సాగుతుంది. అసలేం జరిగిందంటే..
చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భారత సంతతికి చెందిన అతడు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని బుకానన్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించారు. బాలాజీ సూసైడ్ చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అతని మరణం వెనుక ఎటువంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు సైతం ఇది ఆత్మహత్యగా తేల్చారు. నిజానికి బాలాజీ నవంబర్ 26న మరణించగా.. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత సంతతికి చెందిన బాలాజీ OpenAIలో సైంటిస్టుగా పని చేశారు. బాలాజీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం నవంబర్ 2020 నుంచి ఆగస్టు 2024 వరకు OpenAIలో పనిచేశారు. ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్ ద్వారా బాలాజీ వెల్లడించారు. ఆ కంపెనీ పలు కాపీరైట్ల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ విషయమై OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్‌తో వైరం నెలకొంది. ఈ ఆరోపణలు చేసిన 3 నెలల తర్వాత బాలాజీ మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.
OpenAIని 2015లో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ స్థాపించారు. అయితే మూడేళ్ల తర్వాత మస్క్ OpenAIని విడిచిపెట్టి, మరో స్టార్టప్ xAIని స్థాపించారు. ఓపెన్ ఏఐలో సైంటిస్ట్‌గా చేరిన బాలాజీ ఈ ఏడాది అక్టోబర్‌లో.. OpenAI కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని గతంలో న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాజీ ఆరోపణలు చేశారు. అలాగే చాట్‌జీపీటీ వంటి సాంకేతికతలు ఇంటర్నెట్‌ను దెబ్బతీస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎక్స్ ఖాతాలో కూడా బాలాజీ ఫెయిర్ యూజ్, జెనరేటివ్ AI గురించి మరో కథనం రాశారు. ఇందులో బాలాజీ ఏం రాశాడంటే..
I recently participated in a NYT story about fair use and generative AI, and why I’m skeptical “fair use” would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…
— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024
నాకు మొదట్లో కాపీరైట్, ఫెయిర్ యూజ్ వంటి వాటి గురించి పెద్దగా తెలియదు. కానీ GenAI కంపెనీలపై దాఖలైన అన్ని వ్యాజ్యాలను చూసిన తర్వాత ఆసక్తిగా అనిపించింది. అప్పటి నుంచి దీనిని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలో AI ఉత్పత్తులకు న్యాయమైన ఉపయోగం చాలా అసంభవమైన రక్షణగా ఉందని నేను చివరికి తెలుసుకున్నానని తన పోస్టులో తెలిపాడు. ఈ కారణంతోనే సమాజానికి మేలుకంటే హాని చేసే టెక్నాలజీల కోసం ఇకపై తాను పనిచేయాలనుకోవడం లేదని, అందుకే ఆ సంస్థను వీడినట్లు వెల్లడించారు. మరోవైపు OpenAI మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎలన్ మాస్క్.. ‘Hmm..’ అని ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది.
— Elon Musk (@elonmusk) December 14, 2024