Petrol Prices: లీటర్ పెట్రోల్ కేవలం రూ.2 మాత్రమే.. డెడ్ చీప్ కదా.. ఎక్కడో తెలుసా..?
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం అత్యంత చవక ధరకే పెట్రోల్, డీజిల్ లభిస్తున్నాయి. కేవలం లీటర్ పెట్రోల్ రూ.2కే వస్తుంది. ఏయే దేశాల్లో అంటే..

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100కిపైగా చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాలంటే రూ.100కి తక్కువకు మాత్రం ఎక్కడా లభించదు. గత కొన్నేళ్లల్లో ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా.. ఇంకా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గడం లేదు. దీంతో ధరలను భరించలేని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రతీ ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉండగా.. కొన్ని దేశాల్లో మాత్రం కేవలం లీటర్ పెట్రోల్ రూ.2 మాత్రమే ఉంది. ఆ దేశాలేంటో చూద్దాం.
అత్యంత తక్కువ ధర ఎక్కడంటే..?
ప్రపంచంలోనే పెట్రోల్ అత్యంత తక్కువ ధరకే లభించే దేశంగా లిబియాకు పేరు ఉంది. ఇక లీటర్ పెట్రోల్ ధర 0.024 డాలర్లుగా ఉంది. అంటే భారత్ కరెన్సీలో రూ.2.15కే లభిస్తుంది. ఇక ధరల్లో మార్పులను బట్టి రూ.3 వరకు చేరుకుంటుంది. ఇక ఇరాన్‌లో కూడా అత్యంత చౌక ధరకే పెట్రోల్ దొరుకుతుంది. ఇక్కడ 0.029 డాలర్లు ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం రూ.2.50కే లీటర్ పెట్రోల్ లభిస్తుంది. ఇక లబియా, ఇరాన్ తర్వాత వెనిజులా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 0.035 డాలర్లు అంటే రూ.3కే దొరుకుతుంది. ఇక పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశాల్లో అంగోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ కేవలం రూ.27కే లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇక తర్వాతి స్థానంలో కువైట్ ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.28గా కొనసాగుతోంది.
భారత్ స్థానం ఎక్కడ ఉందంటే..?
పెట్రోల్ ధరల విషయంలో భారత్ 73వ స్థానంలో ప్రస్తుతం కొనసాగుతోంది. భారత్‌లో ప్రాంతాలను బట్టి రూ.100 నుంచి రూ.105 మధ్య ప్రస్తుతం పలుకుతోంది. భారతదేశం ముడి చమురును విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల ఎగుమతి, దిగుమతి సుంకాలు, రాష్ట్రాల ట్యాక్సులు, రవాణా చార్జీల కాణంగా ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండే దేశాల్లో ధరలు తక్కువగా ఉంటాయి. చమురును వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో మాత్రం ధరలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీలు అందిస్తున్నాయి. దీని వల్ల ఆయా దేశాల్లో ధరలు తక్కువగా ఉంటాయి. ఇండియాలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ట్యాక్సులు తగ్గిస్తే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశముంటుంది.
