Change Your Flipkart Passwords: ప్రముఖ ఆన్‌లైన్ గ్రాసరీ సంస్థ బిగ్‌బాస్కెట్ ద్వారా లీక్ అయిన డేటాతో ఫ్లిప్‌కార్ట్ యూజర్ల అకౌంట్‌లలో అనధికారిక ట్రాన్సాక్షన్స్ అవుతున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఈ విషయమై సైబర్ సెక్యూరిటీ నిపుణులు రాజశేఖర్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్కెట్‌కు ఉపయోగించే ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌లను కొందరు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెడుతున్నారు. ఇది అనధికారిక లావాదేవీలకు దారి తీస్తుంది. అయితే చాలా మంది బిగ్‌బాస్కెట్ లాగిన్‌కు ఏ వివరాలు ఇస్తున్నారో ఫ్లిప్ కార్ట్, అమేజాన్ కూడా అవే ఇస్తుండడంతో ఈ సమస్య వస్తుందని రాజశేఖర్ తెలిపారు. అయితే అమేజాన్‌లో ట్రాన్సాక్షన్ చేసే ముందు కస్టమర్లను ఓటీపీ అడుగుతుండడంతో ఇందులో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు.
కాబట్టి బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లకు ఒకే పాస్‌వర్డ్ సెట్ చేసుకున్న వారు వెంటనే తమ ఫ్లిప్‌కార్ట్ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని రాజశేఖర్ సూచించారు. ఇక ఈ విషయమై ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ఈ విషయమై తీవ్రంగా ఆలోచిస్తోందని… యూజర్ల డేటా భద్రత విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఆన్‌లైన్‌లో జరుగుతోన్న ఇలాంటి మోసాలపై యూజర్లలో అవగాహన కల్పించే క్రమంలో సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నామని, యూజర్లు తమ అకౌంట్‌లను భద్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పిస్తున్నామని సదరు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిథి చెప్పుకొచ్చారు.