IT Returns Mistakes: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. మీరు మీ ఐటీఆర్‌ను ఫైల్ చేయకుంటే వెంటనే ఫైల్ చేయడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. అయితే రిటర్న్ చేసేందుకు చాలా మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు. ITR ఫైల్ చేసేటప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తెలుసుకోవడం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే ముందు సరైన ఫారమ్‌ను ఎంచుకోవాలి. అందులో పూర్తి వివరాలు పూరించాలి. ఏ పొరపాటు జరిగినా దానిని ఇన్‌కమ్ ట్యాక్స్ తిరస్కరిస్తుంది. ఆదాయ వనరులు, నివాస ఆస్తి ఉందా, విదేశాలలో ఏదైనా ఆస్తి ఉందా?, ఇలా చాలా రకాల ఫారాలు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ITR-1 అనేది జీతం పొందే వ్యక్తుల కోసం. అలాగే మీరు వ్యాపారం నుంచి లాభం లేదా మూలధన లాభం పొందినట్లయితే మీరు ITR-2 నింపాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు అందించడం వంటి వివరాలు సరిగ్గా ఉండాలి. ITR ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితమైన వ్యక్తిగత వివరాలను అందించడం చాలా ముఖ్యం. తప్పుడు సమాచారం అందించడం వలన రిటర్న్ ఫారమ్ తిరస్కరణకు గురికావచ్చు. రీఫండ్ క్లెయిమ్ చేసే పన్ను చెల్లింపుదారులు సరైన బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. అలాగే, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ముందుగా ధృవీకరించడం ఎంతో ముఖ్యం. IFSC కోడ్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా లేకుంటే రీఫండ్‌లు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
ఐటీఆర్‌లో పన్ను మినహాయింపు ఆదాయాన్ని చూపకపోవడం సాధారణంగా జరిగే తప్పిదం. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌లో పన్ను మినహాయింపు పొందిన ఆదాయాన్ని చూపించరు. PPF నుంచి వచ్చే వడ్డీ ఆదాయం, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ, బంధువుల నుంచి పొందిన బహుమతులు వంటి పన్ను మినహాయింపు పొందిన ఆదాయాన్ని వెల్లడించనందుకు సమస్యలు ఎదుర్కొవచ్చు.
గడువుకు ముందు ఐటీఆర్ దాఖలు చేయక పోవడం మరో పెద్ద తప్పుగా చెప్పవచ్చు. గడువు ముగిసిన తర్వాత ITR ఫైల్ చేయడం వలన పెనాల్టీని చెల్లించాల్సి వస్తుంది. మీరు జూలై 31, 2022లోపు మీ రిటర్న్‌ను ఫైల్ చేస్తే, మీరు ITRని తర్వాత సవరించుకోవచ్చు. అదే మీరు నిర్ణీత తేదీ తర్వాత మీ రిటర్న్‌ను ఫైల్ చేస్తే రివిజన్ చేయడానికి అనుమతి ఉండదు. అదే సమయంలో మీరు గడువు ముగిసిన తర్వాత మీ రిటర్న్‌ను ఫైల్ చేస్తే, పన్ను విధించదగిన ఆదాయం 5 లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉంటే 1,000 రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయానికి ఆలస్యమైన రుసుము రూ.5,000 కట్టాల్సి వస్తుంది. మీరు మీ రిటర్న్‌ను డిసెంబర్ 31 లోపు ఫైల్ చేస్తేనే ఈ రుసుములు వర్తిస్తాయి. అదే మీరు మీ రిటర్న్‌ను 2022 తర్వాత ఫైల్ చేస్తే.. అంటే, జనవరి-మార్చిలో ITR ఫైల్ చేసినప్పుడు ఈ మొత్తం 10,000 రూపాయలకు పెరుగుతుంది.
ITRని వేరిఫై చేయకపోవడమూ చాలా మంది చేసే కామన్ మిస్టేక్. ఐటీఆర్ ఫైలింగ్ ఎంత ముఖ్యమో, వెరిఫై చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఐటీఆర్ నింపుతారు కానీ వెరిఫై చేయరు. ఐటీఆర్ వెరిఫై చేయడానికి 120 రోజులు పడుతుంది. ఇది ఆధార్ ఓటీపీ ద్వారా జరుగుతుంది. ఆన్‌లైన్ ధృవీకరణ చేయకపోతే, ITR కాపీని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU)లోకి పంపాలి. ITR ధృవీకరించబడే వరకు మీ రిటర్న్ ప్రాసెస్ అవదు. మీ ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చి మీరు పన్ను చెల్లించనట్లయితే పన్ను ఎగవేత ఉద్దేశ్యంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో ఆదాయపు పన్ను అధికారులకు విచారణ జరిపే హక్కుతో పాటు జరిమానా, శిక్షించే హక్కు కూడా ఉంటుందని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు.
ఈ పొరపాట్లు మాత్రమే కాకుండా, పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లో పేర్కొనని అనేక ఇతర అంశాలు ఉన్నాయి. ఆస్తి లేదా ఏదైనా ఇతర పెట్టుబడి నుంచి మూలధన లాభాలను బహిర్గతం చేయకపోవడం ,అలాగే ఫారం 26AS తో వార్షిక సమాచార ప్రకటన (AIS) సరిపోలకపోవడం వంటివి తప్పులూ ఉంటాయి. అంతేకాదు.. ఫారం-16తో, అన్ని ఆదాయ వనరులను బహిర్గతం చేయకపోవడం, బ్యాంకు నుంచి వచ్చిన వడ్డీని పేర్కొనక పోవడం.. ముందుగా పూరించిన వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయకపోవడం వంటి తప్పులు కూడా సాధారణంగా చాలామంది చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా రిటర్న్ దాఖలు చేయడం ఎంతో ముఖ్యం. తర్వాత ఇబ్బందులతోపాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి