ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికలో ఆ కూటమి విజయం సాధించడానికి మహిళా ఓట్లు ఎంతో కీలకంగా మారాయి. మునుపటి బడ్జెట్లలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు అత్యధికంగా నిధులు కేటాయించారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో మహిళల ఓట్లు గణనీయంగా పెరిగి, 2024లో ఎన్ డీఏ విజయానికి పునాదిగా నిలిచాయి. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019లో పోల్చితే 18 మిలియన్ల మంది మహిళలు ఓటింగ్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఆదాయ బదిలీ పథకాలు, అక్షరాస్యత కార్యక్రమాలు, ముద్ర యోజన రుణాలు, పారిశుధ్య కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇంటి యాజమాన్యం వంటి మహిళా ప్రాధాన్య కార్యక్రమాల వల్ల ఎన్ డీఏ ప్రభుత్వంపై మహిళలకు నమ్మకం ఏర్పడింది. తద్వారా వారి ఓటింగ్ శాతం పెరిగి, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మార్గాన్ని సుగమం చేసింది.
విశ్వసనీయ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్ డీఏ చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమాలతో 4.5 మిలియన్ల మహిళా ఓటర్లు పెరిగారు. ముద్ర యోజనతో సహా ఉపాధి పథకాలకు 3.6 మిలియన్ల ఓటర్ల ఆదరణ లభించింది. పీఎంఏవై పథకానికి 2 మిలియన్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక పారిశుధ్య కార్యక్రమాలు 2.1 మిలియన్ల మహిళా ఓటర్లను తీసుకువచ్చాయి. ఎందుకంటే ఈ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలలో 1.5 కోట్ల మంది మహిళా ఓటర్లు పెరిగారు. ఈ కార్యక్రమాలు అమలు కాని రాష్ట్రాలలో కేవలం 30 లక్షల మంది మాత్రమే ఉండడం గమనార్హం.
2024-25 బడ్జెట్ లో మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే వివిధ పథకాల కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో మహిళా, శిశు అభివృద్ధి
మంత్రిత్వశాఖ బడ్జెట్ మూడు శాతం పెరిగి, రూ.26,092 కోట్లకు చేరుకుంది. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత ఉత్తమ కేటాయింపు అని చెప్పవచ్చు. దీంతో త్వరలో ప్రవేశ పెట్టనున్న 2025-26 బడ్జెట్ కూడా మహిళా సాధికారతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి