Traffic Rules: డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు.. లేదంటే మీ ప్రాణాలు పోయినట్లే.!
డ్రైవింగ్ చేసేటప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ప్రాణాలు పోతాయి.
డ్రైవింగ్ చేసేటప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ప్రాణాలు పోతాయి. మీకు ఇది తెలుసా.? సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల దేశంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(MORTH) విడుదల చేసిన ఓ నివేదికలో పలు సంచలన గణాంకాలు తెరపైకి వచ్చాయి . ఈ నివేదిక ప్రకారం, 2021లో సీటు బెల్టులు ధరించకపోవడం వల్ల 16,397 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు . వీరిలో 8,438 మంది డ్రైవర్లు కాగా, మిగిలిన 7,959 మంది ప్రయాణికులు ఉన్నారు. అందుకే సురక్షితమైన ప్రయాణం కోసం సీటు బెల్ట్ తప్పనిసరి అని.. అలాగే ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం ముఖ్యమని కేంద్రం తెలిపింది.
భారతదేశంలో ‘రోడ్డు ప్రమాదాలు – 2021’ పేరిట ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం.. 2021వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 46,593 మంది మరణించారు. వీరిలో 32,877 మంది డ్రైవర్లు కాగా, 13,716 మంది ప్రయాణికులు ఉన్నారు. 2021లో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3,84,448 మంది గాయపడ్డారు. మరోవైపు అదే సంవత్సరంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 93,763 మంది గాయపడ్డారు. అలాగే సీటు బెల్టు పెట్టుకోని కారణంగా 39,231 మంది గాయాలపాలయ్యారు. హెల్మెట్, సీటు బెల్టు వంటివి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారిస్తాయి.
సైరస్ మిస్త్రీ మరణం..
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సెప్టెంబర్ 4న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో మిస్త్రీ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో మిస్త్రీతో పాటు అతడి స్నేహితుడు జహంగీర్ పండోల్ వెనుక సీట్లో కూర్చున్నాడు. ఆ సమయంలో సైరస్ మిస్త్రీ సీటు బెల్టు పెట్టుకోలేదని తేలింది. డివైడర్‌ను ఢీకొనడం.. కారు అతివేగంగా ఉండటంతో మిస్త్రీకి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో మిస్త్రీ, పండోల్ ఇద్దరూ చనిపోయారు.
సీటు బెల్టు పెట్టుకోకపోతే జరిమానా..
ఈ ఘటన తర్వాత సీటు బెల్టుల వివాదం పెద్ద దుమారాన్ని రేపింది. ముఖ్యంగా వెనుక సీటులో కూర్చున్న వాళ్లు సైతం సీట్ బెల్టు పెట్టుకోవాలని పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం సీటు బెల్టులు, కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి, లేదా వెనుక కూర్చున్న వ్యక్తి ఎవరు ధరించకున్నా రూ.1,000 జరిమానా విధిస్తారు.
కాగా, శుక్రవారం క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో అతడు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా తగలబడింది. రాత్రి ప్రయాణం కావడంతో అతడికి కాస్త నిద్రమత్తు వచ్చిందని.. రెప్పపాటులో ఈ ప్రమాదం జరిగిందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. అయితే ఈ ప్రమాద సమయంలో పంత్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే అతడి ప్రాణానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టం చేశారు.