ICICI credit cards: క్రెడిట్ కార్డు వాడితే జేబుకు చిల్లే.. ఐసీఐసీఐ బ్యాంకు కొత్త నిబంధనలు
నేడు ప్రతి ఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డులు కనిపిస్తున్నాయి. వీటి ద్వారా చాలా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. జేబులో డబ్బులు లేకపోయినా సరే.. క్రెడిట్ కార్డు ఉంటే చాలు సంతోషంగా షాపింగ్ చేయవచ్చు. మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. వైద్యం తదితర అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడతాయి.
దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. వాటిపై ప్రత్యేక క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు తదితర అనేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డుల వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి చార్జీల విషయంలో నిబంధనలు మారుతూ ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దేశంలోని ప్రైవేటు బ్యాంకులలో ఐసీఐసీఐ ఒకటి. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుల నిబంధనలను ఇటీవల మార్చింది. వాటిని నవంబర్ 15 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఈ బ్యాంకు ఈ సంవత్సరం రెండో సారి తన క్రెడిట్ కార్డుల పోర్టుఫోలియోను సవరించినట్టయ్యింది. కొత్త నిబంధనల ప్రకారం.. యుటిలిటీ, ఇన్స్యూరెన్స్, కిరాణా ఖర్చుల రివార్డులపై పరిమితి విధించింది. విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ కోసం అర్హతలను కూడా మార్పు చేశారు.
విమానాశ్రయం లాంజ్ యాక్సెస్ కోసం చెల్లించాల్సిన డబ్బును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం డోమెస్టిక్ ఎయిర్ పోర్టు లాంజ్ యాక్సెస్ కోసం తొలి త్రైమాసికంలో రూ.75 వేలు వరకూ క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయాలి. గతంలో ఈ పరిమితి రూ.35 వేలు మాత్రమే ఉండేది. అంతకు ముందు కేవలం రూ.5 వేలు చెల్లిస్తే సరిపోయేది. ఈ మొత్తాన్ని గడిచిన ఆరు నెలల్లో ఐసీఐసీఐ బ్యాంకు భారీగా పెంచేసింది. యుటిలిటీలు, బీమా ప్రీమియం చెల్లించే కార్డు దారులకు ఐసీఐసీఐ బ్యాంకు రివార్డు పాయింట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. వాటిని పొందడానికి ఇప్పుడు ఖర్చు పరిమితిని పెంచేశారు. రూబిక్స్ వీసా, సప్పిరో వీసా, ఎమెరాల్టే వీసా తదితర ప్రీమియం క్రెడిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు ప్రతి నెలా రూ.80 వేలకు పైన ఖర్చు చేస్తే రివార్డులు పొందుతారు. ఇతర కేటగిరీల వారికి రూ.40 వేలకు పరిమితం చేశారు.
డిపార్టుమెంట్ స్టోరులు, కిరాణా దుకాణాల్లో చేసిన లావాదేవీలకు సంబంధించి రివార్డు పాయింట్లు అందిస్తారు. వీటి ఖర్చు పరిమితిని కూడా ఇప్పుడు మార్పు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు రూబిక్స్ వీసా, సప్పిరో వీసా, ఎమరాల్డ్ వీసా, ఇతర ప్రీమియం క్రెడిట్ కార్డుదారులు ప్రతినెలా రూ.40 వేలు ఖర్చు చేస్తే రివార్డులు అందుకుంటారు. ఇతర కార్డుదారులు రూ.20 వేలు ఖర్చు పెడితే సరిపోతుంది. ఇంధన సర్ చార్జికి మినహాయింపుల విధానంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు నెలకు రూ.50 వేలు కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఒక శాతం సర్ చార్జిని వసూలు చేస్తారు. అలాగే ప్రతి సప్లిమెంటరీ క్రెడిట్ కార్డుకు బ్యాంకు రూ.199 వార్షిక రుసుమును వసూలు చేయనుంది. ప్రభుత్వం లావాదేవీలు నిర్వహించినప్పడు మాత్రం రివార్డు పాయింట్లు ఇవ్వరు. ఎడ్యుకేషన్ పేమెంట్లపై ఒక శాతం ఫీజు విధిస్తారు. డ్రీమ్ ఫోల్క్స్ కార్డు దారులు విమానాశ్రయంలో స్పా సేవలు పొందలేరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి