Promissory Note: అప్పు ఇస్తున్నారా.? ప్రామిసరీ నోటు మీద ఇది లేకపోతే.. చిత్తు కాగితంతో సమానం..
ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని చట్టబద్ధత, కోర్టులో రికవరీ కోసం అవసరమైన ముఖ్యమైన అంశాల గురించి అడ్వకేట్ సుధాకర్ మాటల్లో తెలుసుకోండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. ఈ స్టోరీ చూసేయండి మరి.

సాధారణంగా మనం ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు లేదా తీసుకున్నప్పుడు రాసుకునే అత్యంత ముఖ్యమైన పత్రం ‘ప్రామిసరీ నోట్’. దీన్నే మనం వాడుక భాషలో ‘నోటు రాయడం’ అని అంటాం. అయితే, చాలామంది కేవలం ఒక పేపర్ మీద సంతకం పెడితే చాలు అనుకుంటారు. కానీ, చట్టపరంగా ఆ నోటుకు విలువ ఉండాలంటే అందులో కొన్ని కీలకమైన అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయాల గురించి ప్రముఖ న్యాయవాది సుధాకర్ ఏం అన్నారో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!
ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు అప్పు ఇచ్చే వ్యక్తి పేరు, తీసుకునే వ్యక్తి పేరు, వారి అడ్రస్‌లు స్పష్టంగా ఉండాలి. ఎంత మొత్తం అప్పుగా తీసుకుంటున్నారు, దానికి నెలవారీ వడ్డీ ఎంత చెల్లిస్తారు అనే విషయాలను నిక్కచ్చిగా పేర్కొనాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు వడ్డీ కాలమ్‌ని ఖాళీగా ఉంచితే, రేపు పొద్దున కోర్టులో ఆ వడ్డీని క్లెయిమ్ చేసే అవకాశం ఉండదు. కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే తిరిగి పొందే వీలుంటుంది. కాబట్టి ప్రతీ కాలమ్‌ని జాగ్రత్తగా నింపడం చాలా ముఖ్యం.
అంతేకాకుండా, ప్రామిసరీ నోట్ పై ‘రెవెన్యూ స్టాంపులు’ అంటించడం, ఆ స్టాంపుల మీద పేపర్ నుంచి స్టాంపు వరకు కలిసేలా సంతకం చేయడం అత్యంత కీలకం. స్టాంపులు లేని ప్రామిసరీ నోట్ చట్టం దృష్టిలో కేవలం ఒక ‘చిత్తు కాగితం’తో సమానం. అలాగే ఇద్దరు సాక్షుల సంతకాలు, అవసరమైతే గ్యారెంటర్ సంతకం కూడా ఉండాలి. ఏదైనా కారణం వల్ల అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే, మీరు కోర్టు ద్వారా లేదా ట్రిబ్యునల్ ద్వారా రికవరీ కోసం దావా వేయవచ్చు. ఒకవేళ తప్పుడు ఫిర్యాదుల వల్ల ఎఫ్ఐఆర్ నమోదైతే, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి మీ హక్కులను కాపాడుకోవచ్చని సుధాకర్ వివరించారు. అప్పు ఇచ్చే ముందు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.
ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..
