Gold Rates: దుబాయ్ నుంచి ఇండియాకి ఎంత గోల్డ్ తీసుకురావచ్చు? కస్టమ్స్ రూల్స్ తెలుసుకోండి!
విదేశాల్లో ఉండేవాళ్లు ఇండియాకు వస్తూ వస్తూ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ వంటివి కొని తీసుకొస్తుంటారు. అయితే పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో దుబాయ్ లాంటి దేశాల నుంచి బంగారం తీసుకురావొచ్చా? ఎంత వరకూ లిమిట్ ఉంది? కస్టమ్స్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఒకసారి తెలుసుకుందాం.

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తక్కువ ధరకు బంగారం లభించే దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ దేశాలలో దుబాయ్ ఒకటి. దుబాయ్‌లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. అందుకే దుబాయ్ నుంచి వచ్చేవాళ్లు అక్కడి నుంచి ఇండియాకు బంగారాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తుంటారు. అయితే ఇక్కడే కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల నుంచి బంగారం తీసుకురావడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే..
రూల్స్ ఇవే..
భారతీయులు ఎక్కువగా దుబాయ్ నుంచి బంగారం కొనడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ బంగారం కాస్త చౌకగా లభిస్తుంది. అయితే, మరొక దేశం నుంచి పరిమితి కంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే కస్టమ్స్ రూల్స్ ప్రకారం మీకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కొన్నిసార్లు జరిమానా కట్టాల్సి రావొచ్చు లేదా బంగారాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. కస్టమ్స్ రూల్స్ ప్రకారం మహిళలు దుబాయ్ నుంచి 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. అదేవిధంగా పురుషులు అయితే 20 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. ఈ పరిమితికి మించి బంగారం తీసుకువచ్చేవారు 3 నుంచి 10 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక పిల్లలకు 40 నుండి 100 గ్రాముల మధ్య బంగారానికి 3 శాతం, 100 నుండి 200 గ్రాముల మధ్య బంగారానికి 6 శాతం మరియు 200 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారానికి 10 శాతం పన్ను విధించబడుతుంది. పెద్దవాళ్లకు కూడా ఇదే నియమాలు వర్తిస్తాయి. కానీ పన్ను భిన్నంగా ఉంటుంది.
ధరలు ఇలా..
ఇకపోతే దుబాయ్ నుండి బంగారం కొని భారతదేశానికి తీసుకొస్తుంటే, మీ దగ్గర కొనుగోలు రసీదు, క్వాలిటీ సర్టిఫికేట్ వంటివి ఉండాలి. ఒకవేళ గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ అయితే సీరియల్ నంబర్ కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ఇండియాలో పది గ్రాముల బంగారం ధర రూ.1,27,140 ఉంటే యూఏఈలో రూ.1,18,310 ఉంది. ఈ నియమాలను పాటించడం ద్వారా, దుబాయ్ నుండి భారతదేశానికి తక్కువ ధరకు బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి చట్టపరమైన సమస్యలు ఉండవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




