అమ్మ బాబోయ్.. మళ్లీ పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయా?
హోర్ముజ్ జలసంధి చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ముడి చమురు, ఎల్‌పీజీ దిగుమతుల్లో ఈ మార్గం కీలకమైనందున అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, సరఫరా అంతరాయాల ప్రభావం దేశ ఇంధన రంగం పై పడే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్గంలో భద్రతా పరిస్థితులు క్షీణించడం, నౌకాయానంపై అనిశ్చితి పెరగడం వల్ల అంతర్జాతీయ చమురు, ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం పడే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ వంటి దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాలకు ఈ పరిణామాలు కీలకంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి భద్రతకు సంబంధించి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ లేదా దాని అనుబంధాలకు చెందిన నౌకలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇతర దేశాల నౌకలకు మార్గం అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై 20 శాతం సుంకం విధించే అంశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఈ ప్రతిపాదన అమలుకు సంబంధించిన అధికారిక విధానం, అంతర్జాతీయ అంగీకారంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని లక్ష్యాలపై దాడులు చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితి చమురు, సహజ వాయువు సరఫరా వ్యవస్థపై ఒత్తిడిని పెంచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 88 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందులో గణనీయమైన భాగం హోర్ముజ్ జలసంధి గుండా దేశానికి చేరుతుంది. ఇదే మార్గం ద్వారా దేశానికి అవసరమైన ఎల్‌పీజీ దిగుమతుల్లోనూ పెద్ద భాగం వస్తుంది. దీంతో ఈ మార్గంలో అంతరాయాలు ఏర్పడితే చమురు దిగుమతి వ్యయం పెరగడంతో పాటు సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల పెరుగుదల నమోదు చేశాయి. ధరలు బ్యారెల్‌కు 85 డాలర్లకు పైగా చేరుకోవడం దిగుమతి వ్యయాన్ని మరింత పెంచే అంశంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇంధన సరఫరా వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలు అదనపు సవాళ్లను తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల ఎల్‌పీజీ సబ్సిడీపై స్పందిస్తూ, సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీతో సిలిండర్లు అందిస్తోందని తెలిపారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కొనసాగితే భవిష్యత్తులో వ్యయభారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతేకాకుండా, అంతర్జాతీయ షిప్పింగ్ డేటా ప్రకారం హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే కొన్ని వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. భద్రతా కారణాలతో నౌకాయాన సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో సరఫరా సమయాలు, రవాణా ఖర్చులు పెరిగే అవకాశాన్ని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు భారత్‌లో ఇంధన ధరలు, ఎల్‌పీజీ సరఫరా, దిగుమతి వ్యయాలపై ఎంత మేర ప్రభావం చూపుతాయన్నది రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
