Housing Prices: నిర్మాణ వ్యయం పెరగడం వల్ల వచ్చే ఆరు నెలల్లో రెసిడెన్షియల్ యూనిట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని గృహ కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల 73 శాతం మంది ప్రజలు ఇళ్ల కొనుగోలుపై రాయితీలు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను కోరుకుంటున్నారు. హౌసింగ్ పోర్టల్ Housing.com, రియల్ ఎస్టేట్ సంస్థ NAREDCO సంయుక్త సర్వేలో ఈ ధోరణి వెలుగులోకి వచ్చింది. ఈ సర్వే 2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల అభిప్రాయం ఆధారంగా రూపొందించారు. Housing.com ‘రెసిడెన్షియల్ కన్స్యూమర్ సెంటిమెంట్ ఔట్‌లుక్ జనవరి-జూన్ 2022’ నివేదిక విడుదల చేసింది. ఇందులో పాల్గొన్న 47 శాతం మంది ప్రజలు షేర్లు, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి ఇతర పెట్టుబడి సాధనాలకు బదులుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. 2020 సంవత్సరం ద్వితీయార్థంలో ఈ నిష్పత్తి 35 శాతం మాత్రమే.
వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరగవచ్చు
ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో 73 శాతం మంది ప్రజలు ఇంటి కొనుగోలుకి ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా తగ్గింపు ధరలు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఆశిస్తున్నారు.
గృహ రుణంపై ప్రభుత్వం మరింత పన్ను మినహాయింపు ఇవ్వాలి
గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపును పెంచాలని, నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ రేట్లను తగ్గించాలని ఈ నివేదికలో సూచించారు. దీంతో పాటు చిన్న డెవలపర్లకు కూడా సులభంగా రుణాలు అందించేలా ఏర్పాట్లు చేయాలి.