AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గన్ కొని లైసెన్స్ తీసుకోవాలా? లైసెన్స్ వచ్చిన తర్వాత గన్ కొనాలా? రూల్స్ ఇవే..

భారతదేశంలో గన్ లైసెన్స్ పొందాలంటే 21 ఏళ్లు నిండాలి. సరైన కారణం, పోలీస్ వెరిఫికేషన్, అవసరమైన పత్రాలు ఉండాలి. NDAL-ALIS ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లైసెన్స్ వచ్చిన తర్వాత అధీకృత డీలర్‌ నుంచి మాత్రమే గన్ కొనాలి. సెకండ్‌హ్యాండ్ గన్‌ కొనుగోలుకు కూడా లైసెన్సింగ్ అథారిటీ అనుమతి, అధికారిక బదిలీ ప్రక్రియ తప్పనిసరిగా పాటించాలి.

గన్ కొని లైసెన్స్ తీసుకోవాలా? లైసెన్స్ వచ్చిన తర్వాత గన్ కొనాలా? రూల్స్ ఇవే..
Gun License In India
SN Pasha
|

Updated on: Sep 02, 2026 | 5:46 PM

Share

మన దేశంలో తుపాకీని కలిగి ఉండటం చట్టపరంగా పూర్తిగా నిషేధం కాదు. అయితే ఆయుధాన్ని కొనుగోలు చేయాలన్నా, కలిగి ఉండాలన్నా తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గన్ లైసెన్స్ ఉండాలి. ఆయుధాల చట్టం 1959, ఆయుధాల రూల్స్ 2016 ప్రకారం లైసెన్సింగ్ అధికారులు దరఖాస్తుదారుడి అర్హతలు, అవసరం, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తారు.

21 ఏళ్లు నిండితేనే దరఖాస్తు

సాధారణంగా 21 సంవత్సరాలు పూర్తైన వ్యక్తి ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వయస్సు ఒక్కటే అర్హత కాదు. దరఖాస్తుదారుడికి ఆయుధం అవసరమయ్యే సరైన కారణం ఉండాలి. ప్రాణం లేదా ఆస్తికి ముప్పు ఉందని నిరూపించగల పరిస్థితులు, స్పోర్ట్స్ షూటింగ్ వంటి కొన్ని కారణాలను నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చు. చట్టపరంగా ఆయుధం కలిగి ఉండటానికి అనర్హత ఉన్న వ్యక్తులకు లైసెన్స్ మంజూరు చేయరు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ డేటాబేస్ అఫ్ అర్మ్స్ లైసెన్సెస్–అర్మ్స్ లైసెన్స్ ఇస్సుఎన్స్ సిస్టం (NDAL-ALIS) ద్వారా ఆయుధ లైసెన్స్‌కు సంబంధించిన అనేక సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. దరఖాస్తుదారు తన వివరాలను నమోదు చేసి, సంబంధిత లైసెన్స్ సేవను ఎంచుకుని అవసరమైన పత్రాలను సమర్పించాలి. ప్రాంతాన్ని బట్టి సంబంధిత లైసెన్సింగ్ అథారిటీ దరఖాస్తును పరిశీలిస్తుంది.

పోలీస్ వెరిఫికేషన్ కీలకం

దరఖాస్తు చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారుడి నేపథ్యం, క్రిమినల్ రికార్డు, ఆయుధం అవసరానికి సంబంధించిన కారణాలు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తారు. అవసరమైన సందర్భాల్లో వైద్య ధ్రువీకరణ పత్రం, గుర్తింపు-చిరునామా రుజువులు, ఫొటోలు, సురక్షితంగా ఆయుధాన్ని నిల్వ చేస్తాననే అంగీకార పత్రం వంటి డాక్యుమెంట్లు కూడా అవసరం కావచ్చు.

లైసెన్స్ వచ్చిన తర్వాతే కొనుగోలు

లైసెన్స్ మంజూరైనంత మాత్రాన ఏ రకమైన తుపాకీ అయినా కొనుగోలు చేస్తాం అంటే కుదరదు. లైసెన్స్‌లో అనుమతించిన ఆయుధ కేటగిరీ, ఇతర షరతులను పాటించాలి. ఆయుధాన్ని చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన అధీకృత ఆయుధ విక్రేత ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. అనధికారిక వ్యక్తులు లేదా మార్కెట్ల నుంచి ఆయుధం కొనుగోలు చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు.

సెకండ్‌హ్యాండ్ గన్‌కు కూడా నిబంధనలు

ఇప్పటికే మరొక వ్యక్తి పేరుపై ఉన్న గన్‌ను సెకండ్‌హ్యాండ్‌గా కొనుగోలు చేయాలనుకున్నా నేరుగా చేతులు మార్పిడి చేయడం సాధ్యం కాదు. ఆయుధ విక్రయం లేదా బదిలీకి సంబంధిత లైసెన్సింగ్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త కొనుగోలుదారుడి అర్హత, లైసెన్స్ తదితర అంశాలు పరిశీలించిన తర్వాతే అధికారిక బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది.

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

లైసెన్స్ లేకుండా తుపాకీని కొనుగోలు చేయడం, కలిగి ఉండడం లేదా అనధికారికంగా బదిలీ చేయడం తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. అందువల్ల గన్ కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా అధికారిక లైసెన్సింగ్ ప్రక్రియను పూర్తి చేసి, లైసెన్స్‌లో పేర్కొన్న అన్ని నిబంధనలను పాటించడం అత్యంత ముఖ్యం.

Follow Us