Google CEO: తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందించే జియోతో కలిసి పనిచేస్తున్నామన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
Google CEO Sundar Pichai: సరసమైన ధర స్మార్ట్ ఫోన్లు అందించే జియో.. మరో బిగ్ న్యూస్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొస్తోంది. స్వల్ప, మధ్యస్థ ఆదాయ వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా...
సరసమైన ధర స్మార్ట్ ఫోన్లు అందించే జియో.. మరో బిగ్ న్యూస్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొస్తోంది. స్వల్ప, మధ్యస్థ ఆదాయ వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఓ చవకైన స్మార్ట్ ఫోన్ కోసం తమ భాగస్వామి జియోతో కలిసి కృషి చేస్తున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన కొందరు మీడియా ప్రతినిధులతో పిచాయ్ వర్చువల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ… తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందించడంపై ఫోకస్ పెట్టామని స్ఫష్టం చేశారు. చవక ధర స్మార్ట్ ఫోన్ విషయంలో జియోతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు.
గతేడాది జియో ప్లాట్ ఫార్మ్స్ వేదికపై గూగుల్ సంస్థ రూ.33,737 కోట్లతో 7.7 శాతం వాటాలను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో అన్ని సదుపాయాలతో కూడిన ప్రారంభస్థాయి స్మార్ట్ ఫోన్ తయారీకి జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, తమ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువస్తారు? ధర ఎంత? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు సుందర్ పిచాయ్. డిజిటల్ ఇండియా దిశగా గూగుల్ తన వంతు సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.
గత ఏడాది ప్రకటించిన ‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్'(ఐడీఎఫ్) లో భాగంగా జియో ప్లాట్‌ఫామ్‌లలో గూగుల్ పెట్టుబడి పెట్టింది. ఇందులో 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులపై కోవిడ్ ప్రభావం గురించి మాట్లాడిన పిచాయ్.. ఈ వైరస్ సంక్షోభం ప్రజల జీవితాల్లో సాంకేతికత ప్రాముఖ్యతను హైలైట్ చేసిందని పిచాయ్ వివరించారు.
“గూగుల్ మీట్ రూపకల్పన కానివ్వండి, లేక అది అన్ని టెలికాం నెట్వర్క్స్ లో పనిచేసే విధంగా అభివృద్ధి చేయడం కానివ్వండి, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వినిమయానికి మరిన్ని అవకాశాలు కల్పించడం కానివ్వండి… మేం మరింత తీవ్రంగా శ్రమించడానికి కరోనా పరిస్థితులే కారణం” అని వివరించారు.