Gold Rates: భారీగా తగ్గుతున్న బంగారం రేట్లు.. తగ్గింపునకు ప్రధాన కారణాలివే..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ప్రస్తుతం బంగారం అనేది రిస్క్ లేని పెట్టుబడి ఎంపికగా మారింది. పెరుగుతున్న అనిశ్చితితో పాటు ద్రవ్యోల్భణం భయాల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య బాగా పెరిగింది. ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరువైనా క్రమేపి తగ్గుతూ వస్తుంది. నిపుణులు బంగారం ధరలు భవిష్యత్‌లో కూడా తగ్గుతాయని వివరిస్తున్నారు.

ఇటీవల కాలంలో ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో గత 10 రోజుల్లో బంగారం ఔన్సుకు 300 డాలర్ల వరకు తగ్గింది. అంటే ఔన్సుకు 3500 డాలర్ల నుంచి నుండి 3200 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గడానికి అమెరికా, చైనా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కార్మిక దినోత్సవం కారణంగా చైనాలో మే 5 వరకు సెలవులు ఉన్నాయి. దీని కారణంగా డిమాండ్ పడిపోయింది. దీంతో పాటు, అమెరికాలో సంతృప్తికరమైన ఉపాధి గణాంకాలు, అమెరికా-చైనా సుంకాల యుద్ధంలో సడలింపు సంకేతాలు, త్వరలో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటుందనే ఆశల నేపథ్యంలో బంగారం ధరలను తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి సంకేతాలు కనిపిస్తున్నాయని, అందువల్ల పెద్ద క్షీణతకు అవకాశం లేదని మరికొంత మంది చెబుతున్నారు.
బంగారం ధరలు తగ్గడానికి అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య చర్చలపై మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడటంతో ఈ వారం బంగారం ధరలు తగ్గాయి. భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, చైనాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తారు. చైనాకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు అమెరికా సుంకాలపై చర్చలను తిరిగి ప్రారంభించిందని పేర్కొన్నాయి. ఇది కాకుండా చైనాలో సెలవుల వల్ల కూడా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. చైనాలో కార్మిక దినోత్సవ సెలవుల కారణంగా మే 1 నుంచి 5 వరకు మార్కెట్ మూసిశారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశం చైనా కాబట్టి ఈ కాలంలో డిమాండ్ తగ్గింది.
అమెరికాలో ఉపాధి నివేదిక కూడా బంగారం ధరలపై ప్రభావం చూపింది. ఏప్రిల్‌లో అమెరికాలో 1.77 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ వారం బంగారం క్షీణత వార్తల్లో నిలిచినప్పటికీ బంగారానికి దీర్ఘకాలిక మద్దతు బాగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానిని బలపరిచే అనేక అంశాలు ఉన్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నేపథ్యంలో బంగారం ధరలు ఇంక తగ్గవని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








