UPI Lite payment without Internet: ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయి. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో అందరూ ఆర్థిక చెల్లింపులను సులభంగా చేస్తున్నారు. ఈ తరుణంలో యూపీఐ చెల్లింపులలో తలెత్తుతున్న అసౌకర్యాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో తలెత్తుతున్న సమస్యలతో వినియోగదారులు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇంటర్నెట్ లేకుండా డిజిటల్ చెల్లింపులను ప్రారంభించేందుకు UPI లైట్ కోసం నెలల తరబడి నిరీక్షణ తాజాగా ముగిసింది. కొన్ని నెలల క్రితం, RBI ఇంటర్నెట్ లేని ఫీచర్ ఫోన్‌ల కోసం UPI కొత్త వెర్షన్ UPI123Payని ప్రారంభించింది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ కూడా UPI లైట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనితో, ఇప్పుడు అలాంటి వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్నా.. ఇంటర్నెట్ లేకుండా UPIతో లావాదేవీలు చేయగలుగుతారు. ఈ చర్య ఆర్థిక చేరికకు ఊతమిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది.
వాలెట్ లాగా UPI లైట్
UPI లైట్ పీక్ టైమ్‌లో మాత్రమే కాకుండా డౌన్ టైమ్‌లో కూడా ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలు చేయడానికి అనుమతిస్తుంది. ఇది UPI లాగా పనిచేస్తుంది. దాని కంటే సరళమైనది, వేగవంతమైనది. UPI నేరుగా బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేస్తుంది. ఖాతా నుంచే డబ్బును పంపుతుంది. అయితే UPI లైట్ అనేది ఆన్-డివైస్ వాలెట్ లాంటిది. ఈ వాలెట్‌లో వినియోగదారులు ముందుగానే నిధులను జమచేయవచ్చు. ఆ డబ్బుతో లావాదేవీలను చేయవచ్చు. డబ్బు పంపడానికి ఇంటర్నెట్ అవసరం లేదు.
మెరుగులు దిద్దుతున్న ఆర్‌బీఐ
ఇది వాలెట్‌లా పనిచేస్తుంది కావున.. ముందుగా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి అందులో డబ్బును జమచేయాలి. ఆ తర్వాత మీరు ఏ సందర్భంలోనైనా UPI లైట్ వాలెట్‌తో లావాదేవీలు చేయగలుగుతారు. అయితే, డబ్బు పంపే వ్యక్తికి తప్పనిసరిగా ఇంటర్నెట్ ఉండాలి. లేకపోతే డబ్బు అతనికి వెంటనే ట్రాన్స్‌ఫర్ కాదు. తర్వాత ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడల్లా అంటే అతని ఇంటర్నెట్ పనిచేయడం ప్రారంభించినప్పుడు.. అతనికి డబ్బు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. NPCI ప్రస్తుతం UPI లైట్‌ని మరింత మెరుగ్గా చేయడానికి పని చేస్తోంది. NPCI UPI లైట్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేయాలని కోరుకుంటోంది. దీని కోసం ప్రస్తుతం R&D పనులు జరుగుతున్నాయి.
UPI లైట్ – పరిమితులు..
UPI Lite మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. చెల్లింపులు చేయడానికి UPI PINని నమోదు చేయవలసిన అవసరం లేదు. ఇది మీ వాలెట్‌కి జోడించిన నిధులను నేరుగా యాక్సెస్ చేస్తుంది. దాని నుంచి చెల్లింపులు చేస్తుంది. యుపిఐ లైట్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే పరిమితిలోపు లావాదేవీలు చేయడం సాధ్యమవుతుంది. ఈ వాలెట్‌కి డబ్బు జోడించడానికి కూడా పరిమితి ఉంది. మీరు UPI లైట్ వాలెట్‌లో గరిష్టంగా రూ. 2000 జోడించవచ్చు. దీనితో ఒకేసారి గరిష్టంగా రూ. 200 వరకు చెల్లింపు చేయవచ్చు. అయితే రోజువారీ లావాదేవీలపై ఎలాంటి పరిమితి లేదు. ఒక్కసారి రూ.2000 వాడిన తర్వాత అదే రోజు ఎన్నిసార్లయినా రూ.2-2 వేలు జోడించుకోవచ్చు.
ఈ బ్యాంకుల వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం..
BHIM యాప్‌ని ఉపయోగించే వ్యక్తుల కోసం మాత్రమే UPI లైట్ ఫీచర్ ప్రారంభించారు. ప్రస్తుతం, ఎనిమిది బ్యాంకులు UPIlite ఫీచర్‌కు మద్దతు ఇస్తున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. రాబోయే కాలంలో, ఇతర బ్యాంకులు కూడా ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో BHIM యాప్‌తో పాటు ఇతర UPI యాప్‌లకు UPI లైట్ ఫీచర్ సదుపాయాన్ని అందించవచ్చని కూడా భావిస్తున్నారు.
UPI ద్వారా పెరగనున్న లావాదేవీలు..
గతంలో, ఫీచర్ ఫోన్‌ల కోసం యుపిఐని ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ దాస్ మాట్లాడుతూ.. ఫీచర్ ఫోన్‌ల యుపిఐ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయలేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సహాయపడుతుందన్నారు. దీని వల్ల వారు యుపిఐ ప్రయోజనాలను కోల్పోతున్నారని అన్నారు. UPI123pay ద్వారా వినియోగదారులు UPI స్కాన్ & పే ఫీచర్ మినహా అన్ని ఫీచర్లను పొందుతారు. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. కస్టమర్‌లు తమ బ్యాంక్ ఖాతాలను తమ ఫీచర్ ఫోన్‌లతో లింక్ చేయడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. UPI భారతదేశంలో 2016లో ప్రారంభించబడింది. అప్పటి నుండి UPI ద్వారా లావాదేవీలు అనేక రెట్లు పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి