సబ్బులు, బట్టలు, పెర్ఫ్యూమ్, కర్టెన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల ప్రోడక్ట్‌లు.. బడ్జెట్ వస్తువుల నుంచి లగ్జరీ ఉత్పత్తుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. మీరు ఇంట్లోనే కూచుని ఏదైనా వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఇ-కామర్స్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. FIS 2023 గ్లోబల్ పేమెంట్స్ రిపోర్ట్ ప్రకారం.. 2022లో భారతదేశ ఇ-కామర్స్ మార్కెట్ విలువ $83 బిలియన్లు, అలాగే 2026 నాటికి $150 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
పెరుగుతున్న మార్కెట్‌తో పాటు ఇ-కామర్స్ ప్రపంచం కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఉదాహరణకు.. మార్కెట్లో కొన్ని కంపెనీల ఆధిపత్యం కారణంగా చిన్న విక్రయదారులకు పెద్దగా అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం ముసాయిదా ఇ-కామర్స్ పాలసీని సిద్ధం చేసింది. త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకువచ్చిన డ్రాఫ్ట్ ఇ-కామర్స్ కంపెనీల కోసం ఒకే విధమైన నియమాలను రూపొందిస్తోంది. దీనిలో నియమాలు Amazon వంటి పెద్ద కంపెనీలకు వర్తిస్తాయి. అవే నియమాలు భారతీయ ఇ-కామర్స్ కంపెనీలకు కూడా వర్తిస్తాయి. ఇ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తువులను విక్రయించే కంపెనీలలో షేర్లను తీసుకోవడాన్ని నిషేధించారు. అలాగే ఈ కంపెనీల స్వంత ప్రొడక్ట్స్ ను తమ ప్లాట్ ఫామ్ లో సేల్ కి పెట్టడం కుదరదు. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీల గుత్తాధిపత్య నియంత్రణను తొలగిస్తుంది. అలాగే భారతీయ కంపెనీలు పోటీ పడే స్థాయిని అందిస్తుంది.
భారతదేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి ఇ-కామర్స్ ఒక కీలక రంగం. దాని సామర్థ్యాన్ని గుర్తిస్తూ, ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న ఇ-కామర్స్ సెగ్మెంట్ ను నిశితంగా పర్యవేక్షిస్తోంది. అందుకే కొనుగోలు, అమ్మకం, మార్కెటింగ్, పంపిణీ వంటి కార్యకలాపాలను రక్షించడానికి ఇ-కామర్స్ సెగ్మెంట్ కోసం నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త ఇ-కామర్స్ పాలసీ లక్ష్యం ఏంటంటే విక్రేతలందరికీ సమాన అవకాశాలను అందించడమే. ఈ విధానం ఇ-కామర్స్ సైట్‌లను వారి ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకందారుల ఏక ఛత్రయదీపత్యం నుంచి బయటకు తీసుకువస్తుంది. అంతే కాకుండా ఈ విధానం వినియోగదారులకు న్యాయమైన, పారదర్శక పద్దతిలో వస్తువులు దొరికేలా చేస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు కొంతమంది అమ్మకందారులకు ప్రాధాన్యతనిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నందున వారి ఉత్పత్తులు సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఇ-కామర్స్ కంపెనీలు తమ సొంత బ్రాండ్‌లను కూడా కలిగి ఉన్నాయి. ఇన్‌హౌస్ బ్రాండ్ల గురించి చాలా వివాదాలు ఉన్నాయి. ఈ ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీల వద్ద పూర్తి డేటా ఉంది. అందుకే వాటికి వినియోగదారుల ఇష్టాలు, అయిష్టాలు బడ్జెట్‌లతో సహా పూర్తి వినియోగదారు డేటాకు యాక్సెస్ ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా వారు తమ బ్రాండ్లను తీసుకువస్తున్నారు. సెర్చ్ ఫలితాల్లో వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ ప్రస్తుతం తమ బ్రాండ్‌ల కింద ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, వంట నూనెలు, దుస్తులు వంటి అనేక రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.
చివరగా, వినియోగదారుల ప్రయోజనాల గురించి మాట్లాడితే.. చిన్న విక్రేతలకు వారి ఉత్పత్తులకు సమాన అవకాశం ఇస్తే, వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉంటుంది. మార్కెట్‌లో ఆధిపత్య కంపెనీలకు దీనివలన సవాళ్ళు ఎదురవుతాయి. అయితే, అంతిమంగా వినియోగదారులకు ప్రయోజనం ఉంటుంది. మార్కెట్‌లో పోటీ ఎంత ఎక్కువగా ఉంటే వినియోగదారులకు అంతగా పరపతి ఉంటుంది. ధర, నాణ్యత వంటి అంశాలలో కూడా మెరుగుదలలు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి