గుడ్ న్యూస్.. రైళ్లలో వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తారని మీకు తెలుసా? రైల్వే నిబంధనలు ఇవే!
రైలు ప్రయాణం అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో సౌకర్యవంతమైనది. అయితే, ప్రయాణ సమయంలో మంచినీటి అవసరం ఎంతగానో ఉంటుంది. ఈ క్రమంలో భారతీయ రైల్వేలో ఉచితంగా వాటర్ బాటిల్ అందిస్తారా లేక డబ్బులు చెల్లించాలా అనే విషయంలో ప్రయాణికులకు అనేక సందేహాలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇండియన్ రైల్వేస్ వర్తించే స్పష్టమైన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం...

భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులకు ఉచితంగా మంచి నీటి బాటిల్ లభిస్తుందా.. లేదా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే, రైల్వే నిబంధనల ప్రకారం అన్ని రైళ్లలో వాటర్ బాటిళ్లు ఉచితంగా లభించవు. కొన్ని రైళ్లలో మాత్రమే ఉచిత ప్రయాణ మంచినీటి బాటిల్ సదుపాయం ఉంటుంది. సాధారణ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ రైళ్లలో మాత్రం రూ.15 చెల్లించి రైల్ నీర్ బాటిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏ రైళ్లలో వాటర్ బాటిల్ ఉచితంగా ఇస్తారో తెలియాలంటే..
రైల్వే నిబంధనల ప్రకారం సాధారణ ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఉచితంగా నీటి బాటిళ్లు ఇవ్వరు. కానీ, వందే భారత్, రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్ల ప్రయాణ ఛార్జీలోనే క్యాటరింగ్ రుసుము కలిసి ఉండటం వల్ల ప్రయాణికులకు 1 లీటరు రైల్ నీర్ వాటర్ బాటిల్ అందించబడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఎస్సీ, సెకండ్ ఎస్సీ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఇది లభిస్తుంది.
నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకుంటే వాటర్ బాటిల్ ఇస్తారా?
ఐఆర్‌సిటిసి టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు ఆహారం వద్దనుకుని నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ ఉచిత మంచినీటి బాటిల్ సదుపాయం వర్తిస్తుంది. ఆహార రుసుము తగ్గినప్పటికీ, ప్రయాణికుడికి తాగునీరు పొందే హక్కు ఉంటుంది.
రైలు ఆలస్యమైతే అదనపు బాటిల్ ఉచితం:
ప్రీమియం రైళ్లు నిర్ణీత సమయం కంటే 2 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యంగా నడిస్తే, ప్రయాణికులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా మరో వాటర్ బాటిల్‌ను అందిస్తారు.
సాధారణ రైళ్ల నిబంధనలు:
సాధారణ ఎక్స్‌ప్రెస్, మెయిల్ లేదా ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఉచిత నీటి బాటిళ్లను పొందలేరు. వారు నిర్ణీత గరిష్ట చిల్లర ధర అయిన రూ.15 చెల్లించి 1 లీటరు రైల్ నీర్ బాటిల్‌ను స్టేషన్లలో లేదా ప్యాంట్రీ కార్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
కాబట్టి, మీరు ప్రీమియం రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే ఉచిత వాటర్ బాటిల్ పొందే అర్హత మీకు ఉంది. సాధారణ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.




