LPG Refill Booking: సిలిండర్ బుకింగ్ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. అసలు విషయం ఇదే..!
LPG Refill Booking: దేశంలో ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అందుకే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మొత్తంగా ఎల్పీజీ బుకింగ్ గడువులపై వస్తున్న వార్తలు నిజం కాదని, అధికారిక...

LPG Refill Booking: ఇటీవల ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువులపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. గ్యాస్ బుకింగ్ గడువును పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పీఐబీ స్పష్టం చేసింది.
కొన్ని వార్తల్లో ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు 45 రోజులు, ఒకే సిలిండర్ కనెక్షన్ ఉన్న వారికి 25 రోజులు, రెండు సిలిండర్లు ఉన్నవారికి 35 రోజుల గ్యాప్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సమాచారం పూర్తిగా అసత్యమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు.. ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికీ అమల్లో ఉన్న నిబంధనలు ఇవే.
పట్టణ ప్రాంతాల్లో: 25 రోజులు, అదే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు గడువు ఉంది. ఈ గడువును కూడా ఇటీవలే ప్రకటించింది. ఈ గడువులు కనెక్షన్ రకాన్ని బట్టి కాకుండా, ప్రాంతాన్ని బట్టి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో వస్తున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని, అలాగే అలాంటి వార్తలను పంచుకోవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అనవసరంగా భయపడి ముందుగానే సిలిండర్లు బుక్ చేసుకోవడం వల్ల సరఫరాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
సరిపడా నిల్వలు ఉన్నాయి
దేశంలో ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అందుకే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మొత్తంగా ఎల్పీజీ బుకింగ్ గడువులపై వస్తున్న వార్తలు నిజం కాదని, అధికారిక సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Clarification On Lpg Refill Booking
