లీటర్ పెట్రోల్ 2, డీజిల్ 39పైసలు.. 50కే ఫుల్ ట్యాంక్.. ఇది మామూలు కథ కాదుగా..
మన దగ్గర బైక్ లేదా కారు ట్యాంక్ ఫుల్ చేయించాలంటే జేబుకు పెద్ద చిల్లు పడాల్సిందే.. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం మంచినీళ్ల బాటిల్ కంటే కూడా పెట్రోల్, డీజిల్ చాలా చౌకగా దొరుకుతున్నాయి. పలు దేశాల్లో అయితే లీటర్ డీజిల్ ధర కనీసం ఒక్క రూపాయి కూడా లేదంటే నమ్ముతారా..? మరోవైపు లీటర్ పెట్రోల్ రూ. 400 దాటిన దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత చౌకైన, అత్యంత ఖరీదైన ఇంధన ధరలు ఎక్కడున్నాయి..?అనేది తెలుసుకుందాం..

మన దేశంలో పెట్రోల్, డీజిల్ బంకులకు వెళ్లాలంటేనే సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. పెరిగిన ఇంధన ధరలు నేరుగా ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. అయితే ప్రపంచ పటంలో కొన్ని దేశాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అక్కడ మంచినీళ్ల బాటిల్ కంటే కూడా పెట్రోల్, డీజిల్ చాలా చౌకగా దొరుకుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఒక లీటర్ డీజిల్ ధర కనీసం ఒక్క రూపాయి కూడా లేదు. గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఇంధనం లభించే దేశాల్లో లిబియా, ఇరాన్, వెనిజులా ముందువరుసలో ఉన్నాయి. వెనిజులాలో ఒక లీటర్ డీజిల్ ధర కేవలం 39 పైసలు మాత్రమే. ఇక ఇరాన్లో లీటర్ డీజిల్ 53 పైసలకే లభిస్తోంది. అంటే మన దగ్గర చాక్లెట్ కొనే ధర కంటే తక్కువకే ఈ రెండు దేశాల్లో లీటర్ డీజిల్ వస్తోంది. లిబియాలో లీటర్ డీజిల్ ధర రూ. 2.15గా ఉంది. పెట్రోల్ విషయానికి వస్తే లిబియాలో లీటర్ రూ.2.15కే దొరుకుతుంది. ఇరాన్లో రూ.2.65, వెనిజులాలో రూ. 3.25 వద్ద పెట్రోల్ ధరలు ఉన్నాయి.
ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 410.. డీజిల్ రూ. 441!
ఒకవైపు రూపాయి, రెండు రూపాయలకే ఇంధనం దొరుకుతుంటే.. మరోవైపు వాహనదారుల జేబులకు చిల్లు పెట్టే దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంధనం హాంకాంగ్‌లో ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 410.75 కాగా డీజిల్ ధర రూ.441.63 పలుకుతోంది. ఈ జాబితాలో మలావి రెండో స్థానంలో నిలిచింది. అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 300.68, డీజిల్ రూ. 313.75గా ఉంది.
భారత్‌లో అత్యంత చౌక, అత్యంత ఖరీదైన ప్రాంతాలు
మన దేశంలో రాష్ట్రాల పన్నులను బట్టి ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌లో దేశంలోనే అత్యంత చౌకగా ఇంధనం లభిస్తోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 88.66 కాగా, డీజిల్ రూ. 84.56గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో దేశంలోనే అత్యధిక ధరలు నమోదయ్యాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 118.34, డీజిల్ రూ. 106.06 వద్ద కొనసాగుతున్నాయి.
దేశదేశాల్లో ధరలు ఇంతలా ఎందుకు మారుతున్నాయి?
ముడి చమురు ఉత్పత్తి, ప్రభుత్వ రాయితీలు, స్థానిక పన్నుల విధానం, దిగుమతి-ఎగుమతి ఆంక్షలు ఇంధన ధరలను శాసిస్తాయి. సొంతంగా చమురు నిల్వలు ఉండి, భారీగా సబ్సిడీలు ఇచ్చే దేశాల్లో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పన్నుల భారం వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే అగ్రరాజ్యం అమెరికా దీనికి మినహాయింపు. ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే అక్కడ పన్నులు తక్కువగా ఉండటంతో ఇంధనం కాస్త అందుబాటు ధరలోనే ఉంటుంది.
