Agriculture: పోర్టబుల్ కోల్డ్ స్టోరేజీ.. చిన్న రైతులకు చాలా ప్రయోజనం.. విద్యుత్ అవసరమే ఉండదు..!
Agriculture News: దేశంలో టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం సులువుగా మారింది. కానీ పంటని నిల్వచేయడం సవాలుగా మారింది. ఈ పరిస్థితిలో రైతులు పండించిన
Agriculture News: దేశంలో టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం సులువుగా మారింది. కానీ పంటని నిల్వచేయడం సవాలుగా మారింది. ఈ పరిస్థితిలో రైతులు పండించిన పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి నిల్వ చేయాడానికి సరైన మార్గం లేక పంట మొత్తం నాశనమవుతోంది. ఈ సమస్య చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు అలాంటి రైతులందరూ తక్కువ ఖర్చుతో తమ పంటలను నిల్వ చేసుకునే అవకాశం వచ్చింది. పోర్టబుల్ సోలార్ కోల్డ్ స్టోరేజీతో ఇది సాధ్యమవుతుంది. గోవింద్ బల్లభ్ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ (GBPUAT) పంత్‌నగర్‌లో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు కిసాన్ మేళా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పోర్టబుల్ సోలార్ కోల్డ్ స్టోరేజీని ప్రదర్శించారు. ఇది రైతులకు బాగా నచ్చింది. యూనివర్శిటీ డీన్ డాక్టర్ అలకనంద అశోక్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ ఎన్ పటారియా మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతుల కోసం దీనిని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన సోలార్ సిస్టమ్ ఆధారిత పోర్టబుల్ కోల్డ్ స్టోరేజీ అని ఇది సౌరశక్తితో పాటు నేచురల్ నైట్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుందని చెప్పారు. ఇది నడపడానికి విద్యుత్ కూడా అవసరం లేదన్నారు.
పోర్టబుల్ కోల్డ్ స్టోరేజీలో రైతులు పుట్టగొడుగులు, పండ్లు, కూరగాయలు వంటి పంటలను ఎక్కువ కాలం భద్రపరుచుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ కోల్డ్ స్టోరేజీని 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న స్థలంలో సులభంగా అమర్చవచ్చని పేర్కొన్నారు. ఇది చాలా తేలికగా ఉంటుందని, దీనిని నడపడానికి విద్యుత్తు అవసరం లేదని సూచించారు. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని మెట్ట ప్రాంతాల చిన్న రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఉల్లి ఆకులను కోయడానికి ఆనియన్ డిగ్గర్ టాపింగ్ యూనిట్ యంత్రం గురించిన సమాచారాన్ని కూడా అందించారు.