AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రొఫెసర్ మాట విని ఇంట్లోనే పుట్ట గొడుగుల పెంపకం.. వేల రూపాయలు సంపాదించిన విద్యార్థులు

పుట్టగొడుగులు ముఖ్యమైన ఉద్యానవన వాణిజ్య పంట. వ్యవసాయ పొలాల్లో పండించే ఇతర పంటలతో పోలిస్తే ఈ పంటలు ఆకర్షణీయమైన లాభాలను ఇస్తాయి. భారతదేశంలో పుట్టగొడుగుల పెంపకం చాలా మందికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా క్రమంగా పెరుగుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు.

Telangana:  ప్రొఫెసర్ మాట విని ఇంట్లోనే పుట్ట గొడుగుల పెంపకం.. వేల రూపాయలు సంపాదించిన విద్యార్థులు
Mushrooms
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 31, 2025 | 7:12 PM

Share

మంచి కుటీర పరిశ్రమవైపు మీ ఆలోచన ఉంటే..  ఇంట్లోనే పుట్ట గొడుగులు పెంచటం బెస్ట్ అంటున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం సమకూరుతుందంటున్నారు.  ఈ ఏడాది కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏఈఎల్పీలో భాగంగా పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. ఓ చిన్న గదిలో తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి కేవలం 45 రోజుల వ్యవధిలో ఎలా పంట రాబట్టవచ్చో చూపించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెడుతూ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ముత్యం చిప్ప, పాల రకాలకు చెందిన పుట్ట గొడుగు విత్తనాలు ఐదు కిలోలు తెచ్చి పెంపకం చేపట్టారు. ఖర్చులతో కలిపి రూ. 3వేలు వ్యయం అయింది. 40కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి సాధించారు. వాటిని స్థానిక హోటళ్లకు, ఇతరులకు కిలో రూ.250కి విక్రయించి రూ.10వేలు ఆదాయం పొందారు.

ప్రొఫెసర్ శ్రీలత ఈ పుట్టగొడుగుల పెంపకం, వాటి ప్రాధాన్యత వివరిస్తూ.. మహిళలు, యువకులు ఎవరికైనా పుట్ట గొడుగుల పెంపకంపై ఆసక్తి ఉంటే ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇప్పటికే నాలుగు సార్లు కళాశాలలో మహిళలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు దీన్ని సదవకాశంగా మార్చుకుని ఇంటి వద్దనే ఉపాధి పొందొచ్చని, పుట్ట గొడుగులు తింటే మంచి ప్రొటీన్ శరీరానికి అందుతుందన్నారు.

పుట్టగొడుగులు పెంపకం విధానం ఆమె వివరించారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం…

ఓ చిన్న గదిని శుభ్రం చేసుకుని దాని చుట్టూ 5 పరదాలు కట్టాలి. ఆపై ఎండు వరిగడ్డిని 1 నుంచి 15 అంగుళాలు వరకు కత్తిరించాలి. ఫార్మాల్డిహైడ్, కార్బండిజంను నీటిలో కలిపి ఆ ద్రావణంలో గడ్డిని 16 నుంచి 18 గంటల వరకు నానబెట్టాలి. తర్వాత గడ్డిని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన గడ్డిని మొదట ఒక లేయర్ పాలిథిన్ కవర్లలో పెట్టి దానిపై విత్తనాలు వేయాలి. ఇలా నాలుగు నుంచి ఐదు లేయర్ల వరకు పెట్టి రబ్బర్తో మడిచి రోల్ కట్టాలి. అనంతరం దానికి 10 నుంచి 12 రంధ్రాలు పెట్టి.. గదిలో వేలాడదీయాలి. సరిపడా నీటి తడులు అందిస్తూ.. గదిలో తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే… కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి