అమ్మో ఏప్రిల్ ఒకటో తారీఖు..! సామాన్యులపై ఆర్థిక భారం ఇక మొదలు..
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంకింగ్ కస్టమర్‌లపై ప్రభావం చూపే కీలక మార్పులు అమలులోకి వస్తాయి. లేబర్ చట్టాలు, PF కటింగ్స్, HRA, పాన్ నిబంధనలు, ఫాస్టాగ్ ధరలు, HDFC ATM ఛార్జీలు మారనున్నాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంకింగ్ వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. కొత్త లేబర్ చట్టాల అమలుతో ఉద్యోగుల జీతాల నిర్మాణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బేసిక్ శాలరీని మొత్తం జీతంలో 50 శాతం వరకు నిర్ధారించడంతో, ప్రావిడెంట్ ఫండ్ (PF) కటింగ్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో టేక్-హోమ్ శాలరీ కొంత తగ్గవచ్చని అంచనా.
ఇక పన్ను వ్యవస్థలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త ఇన్‌కమ్ టాక్స్ చట్టం 2025 అమల్లోకి రానుండగా, పాత పన్ను విధానాన్ని కొనసాగించే వారికి కొన్ని సడలింపులు లభించనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలను 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు జాబితాలో చేర్చడం ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు అందించే సదుపాయాల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మీల్ వోచర్లపై టాక్స్ ఫ్రీ పరిమితిని రూ.50 నుంచి రూ.200కు పెంచారు. అలాగే కంపెనీలు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.2 లక్షలకు పెంచడం ద్వారా ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
ఇక పాన్ కార్డ్ వినియోగానికి సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. భీమా ప్రీమియం మొత్తం ఎంతైనా సరే పాన్ వివరాలు తప్పనిసరి చేశారు. ఆస్తి కొనుగోళ్లలో రూ.20 లక్షలు దాటితే, అలాగే హోటల్ లేదా ఇతర భారీ ఖర్చుల్లో రూ.1 లక్ష దాటినా పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. రవాణా రంగంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను రూ.3,000 నుంచి రూ.3,075కు పెంచింది. ఇక బ్యాంకింగ్ రంగంలో, HDFC బ్యాంక్ ఏటీఎంలలో యూపీఐ ద్వారా ఐదుసార్లు మించి నగదు ఉపసంహరణ చేస్తే రూ.23 చార్జీ విధించనుంది. ఈ మార్పులన్నీ సామాన్యుల రోజువారీ ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
