AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య పేరుపై లోన్లు తీసుకొని పారిపోయిన భర్త! చివరికి ఏం జరిగిందంటే..?

అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలన తీర్పులో, వివాహ బంధాన్ని డబ్బు కోసం దుర్వినియోగం చేసిన భర్తకు రూ.15 లక్షల జరిమానా విధించింది. భార్య పేరు మీద రుణాలు తీసుకుని, ఆమెను వదిలిపెట్టి, తిరిగి భరణం కోరిన భర్త చర్యను కోర్టు తీవ్రంగా ఖండించింది.

భార్య పేరుపై లోన్లు తీసుకొని పారిపోయిన భర్త! చివరికి ఏం జరిగిందంటే..?
Indian Currency 7
SN Pasha
|

Updated on: Apr 26, 2026 | 7:30 AM

Share

వివాహ బంధాన్ని డబ్బు కోసం నవ్వులపాలు చేసిన దిగ్భ్రాంతికరమైన కేసులో అలహాబాద్‌ హై కోర్డ్‌ కీలక తీర్పు ఇచ్చింది. భార్య పేరు మీద లక్షల రూపాయల రుణాలు తీసుకుని, కారు, నగలతో పరారైన భర్తే తిరిగి అదే భార్య నుంచి భరణం కోరడం ఈ కేసులో ప్రధానాంశంగా నిలిచింది. ఈ జంట 2019 మే 18న వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, తర్వాత భార్యకు ఉద్యోగం లభించింది. భర్త మాత్రం ప్రభుత్వ ఉద్యోగం పొందలేక, ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి న్యాయవాదిగా పని ప్రారంభించాడు.

అయితే వివాహానంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భార్య తనపై మానసిక, శారీరక వేధింపులు జరిగాయని ఆరోపించగా, భర్త మాత్రం భార్య ప్రవర్తన మారిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భార్య పేరు మీద భర్త రెండు వ్యక్తిగత రుణాలు, ఒకటి రూ.11.5 లక్షలు, మరొకటి రూ.13.56 లక్షలు తీసుకున్నట్లు వెల్లడైంది. భూమి కొనుగోలు కోసం తీసుకున్న ఈ డబ్బును, అనంతరం తన ఖాతాకు బదిలీ చేసుకుని వినియోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంతటితో ఆగకుండా భార్యను పుట్టింటి వద్ద వదిలిపెట్టి, కారు, నగలు, ఇతర విలువైన వస్తువులతో భర్త పరారైనట్లు కేసు వివరాలు చెబుతున్నాయి. కారు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితురాలు తెలిపింది.

దీనిపై 2024 మార్చిలో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, దాన్ని రద్దు చేయాలని భర్త చేసిన ప్రయత్నాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం అతడు భరణం కోసం దరఖాస్తు చేయగా, కుటుంబ న్యాయస్థానం అతడిని భార్యకు నెలకు రూ.5,000 చెల్లించాలని, అదనంగా ఖర్చుల కోసం రూ.10,000 ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా 2026 ఏప్రిల్ 23న హైకోర్టు విచారణలో, భర్త తప్పుడు అఫిడవిట్‌ల ద్వారా తన ఆదాయాన్ని దాచిపెట్టి, భార్యను ఆర్థికంగా దోపిడీ చేసినట్లు తేల్చింది. వివాహాన్ని లాభాల సాధనంగా ఉపయోగించడం అసహ్యకరమని పేర్కొంటూ, కోర్టు అతనికి రూ.15 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో వివాహ బంధాన్ని దుర్వినియోగం చేసే వారికి కఠిన హెచ్చరిక ఇచ్చినట్టుగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us