చైనాతో పోటీపడాలంటే 14 గంటలు పనిచేయాల్సిందేనా..? భారత్‌లో హాట్ డిబేట్..!

కూటి కోసం కూలి కోసం అరబ్బు దేశాలకెళ్లి.. అక్కడి అక్రమార్కులకు చిక్కి ఎడారుల్లో గొర్రెల కాపరిగా మారి.. ఏళ్ల తరబడి కట్టుబానిసత్వం చేసి చిక్కి శల్యమైన ఒక అభాగ్యుడి జీవితం ఇటీవలే తెరమీదకెక్కి కంటతడి పెట్టించింది. సగటుమనిషి యంత్రాల చక్రాల మధ్య పడి ఎలా నలిగిపోతున్నాడో.. మెదడు కోల్పోయి యంత్రుడిగా ఎలా మారిపోతాడో.. యాంత్రికంగా పనిచేయడాన్ని ఎలా అలవాటుగా మార్చుకుంటాడో..

చైనాతో పోటీపడాలంటే 14 గంటలు పనిచేయాల్సిందేనా..? భారత్‌లో హాట్ డిబేట్..!
70 Hour Work Week
Follow us
K Sammaiah

| Edited By: Gunneswara Rao

Updated on: Jul 28, 2024 | 12:37 PM

చికాగో నగరంలో 1886 మే 1న హే మార్కెట్‌లో ” ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు భానిస సంకెళ్లు తప్పా” అంటూ ఆకాశం చిల్లులు పడేలా గాండ్రించిన గొంతులు.. రోజుకు 8 గంటలతో కూడిన పని దినాలు, న్యాయమైన వేతనం, పని చేసే చోట మౌలిక సదుపాయాలు వంటివి సాధించిపెట్టాయి. నాటి ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలైన కార్మికుల రక్తంతో హే మార్కెట్‌ ఎరుపెక్కింది. ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ కారణంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు మళ్లీ అన్యాయానికి గురయ్యే ప్రమాదం తలుపు చాటున తొంగి చూస్తూ ఉంది. పని గంటలపై తాజాగా ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు, ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని శ్రమను దోచుకునే మార్కెట్‌ శక్తులు ఏకం అవుతున్నాయనే ఆందోళన ఉద్యోగ, కార్మిక వర్గాల్లో వ్యక్తం అవుతున్నది.

కూటి కోసం కూలి కోసం అరబ్బు దేశాలకెళ్లి.. అక్కడి అక్రమార్కులకు చిక్కి ఎడారుల్లో గొర్రెల కాపరిగా మారి.. ఏళ్ల తరబడి కట్టుబానిసత్వం చేసి చిక్కి శల్యమైన ఒక అభాగ్యుడి జీవితం ఇటీవలే తెరమీదకెక్కి కంటతడి పెట్టించింది. సగటుమనిషి యంత్రాల చక్రాల మధ్య పడి ఎలా నలిగిపోతున్నాడో.. మెదడు కోల్పోయి యంత్రుడిగా ఎలా మారిపోతాడో.. యాంత్రికంగా పనిచేయడాన్ని ఎలా అలవాటుగా మార్చుకుంటాడో.. హాస్యచక్రవర్తి చార్లీ చాప్లిన్ బ్లాక్‌అండ్‌వైట్ రోజుల్లోనే చెప్పి చూపించాడు. ఇప్పుడు మన ఫ్యూచర్లు కూడా ఇంతకంటే దారుణంగా మారబోతున్నాయా..? ఒళ్లు గుల్ల చేసుకుని బుర్రలు చెడిపోయి.. .. పిచ్చోళ్లుగా మారే సమయం దగ్గరలోనే ఉందా..?

దేశం అభివృద్ధి చెందాలంటే యువతీ యువకులు వారానికి 70 గంటల పాటు పనిచేయాలని నారాయణ మూర్తి ఇటీవల వ్యాఖ్యానించారు. పని గంటలను పరిస్థితులకు తగ్గట్టు సవరించుకోకపోతే అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోటీపడలేమని నారాయణ మూర్తి అన్నారు. ‘‘అందుకే నేను మన దేశ యువతను విజ్ఞప్తి చేస్తున్నా. ‘ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటల పాటు పని చేసేందుకు నేను సిద్ధం’ అంటూ యువత కూడా నాతో పాటు ముందుకు రావాలి’’ అని నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే భారత యువత కూడా రోజుకు 14 గంటలు పనిచేయాల్సిందేనంటూ పలువురు బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు నారాయణ మూర్తి వాదనతో ఏకీభవించారు.

70 Hour Work Week2

70 Hour Work Week

వారానికి 70 గంటల పని!

కార్పొరేట్‌ కంపెనీల అధినేతల వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సైతం వారానికి 70 గంటల పనిపై కసరత్తు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం వారానికి 70 గంటలు ఎందుకు చేయకూడదంటూ ప్రశ్నిస్తోంది. రోజుకు 14 గంటలు చొప్పున వారానికి 70 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలంటూ సిద్ధ రామయ్య సర్కార్‌ లేబర్స్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌లో మార్పులకు సిద్ధం అవుతోంది!. త్వరలో అసెంబ్లీలో బిల్లుపెట్టి చట్టం చేసైనా సరే వారానికి 70 గంటలు పని చేయించుకుంటామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ ‘గాడిద చాకిరీ’ ఫార్ములా ఎంటిరా బాబోయ్‌ అంటూ ఉద్యోగ కార్మిక వర్గాలు తలలు పట్టుకుంటున్నారు.

బొమ్మరిల్లు సినిమాలో “సత్తి మంచి పనోడు” డైలాగ్‌ వలె వర్క్ ఈజ్ వర్‌షిప్ అని, పనిని భక్తిశ్రద్ధలతో చేయాలని, పనియే ప్రత్యక్ష దైవమని పెద్దోళ్లు నేర్పించి పంపి.. మనల్ని మంచి పనోళ్లుగా తీర్చి దిద్దాలని కలలుగన్నారు. ఆమేరకు పని ప్రదేశాల్లో పరిశ్రమిస్తూ.. పని పట్ల భయభక్తుల్ని ప్రదర్శిస్తూ ఆవిధంగా ముందుకు దూసుకెళ్తున్నాం కూడా. ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పితే.. మిగతా అన్ని పని ప్రదేశాల్లోనూ ఠంచనుగా వచ్చి.. గడియారంలో క్షణాల ముల్లుతో పోటీపడి పరుగెత్తుతూ బుద్ధిగా పనిచేసుకు బతికేస్తున్నాం. మిగతా పనోళ్ల సంగతి అటుంచితే.. ఐటీ సెక్టార్‌లో సాఫ్ట్‌వేరోళ్ల జిందగీలు మాత్రం పనిలోనే మునిగి… పనితోనే చిరిగిపోతున్నాయి.

పనిలో పడి, టార్గెట్లకు లొంగిపోయి, రాత్రి ఏదో.. పగలు ఏదో తేడా తెలియక.. ఒక్కోసారి నిద్రాహారాల్ని కూడా మర్చిపోయి.. వీలునుబట్టి ఆరోగ్యాల్ని కూడా ఖర్చుపెట్టుకుని రోగాల్ని కొనితెచ్చుకుని, ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న టెక్కీల సంఖ్య వేలల్లో ఉంది. ఇలా ఐటీ శ్రామిక వర్గం చచ్చీచెడీ బతుకునీడుస్తుంటే.. కొత్త పనిగంటల చట్టం పేరుతో ఒంగోబెట్టి వీపుల బండరాయి పెట్టి పైకి లేవొద్దు, బండరాయి కింద పడొద్దు అనే శరతులు ఉద్యోగ కార్మకవర్గం మీద మోదబోతోందట కర్నాటక సర్కార్.

70 Hour Work Week3

70 Hour Work Week

వర్కింగ్‌ క్లాస్‌పై అతిపెద్ద దాడి

కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేస్తోందని.. ఉద్యోగులతో రోజుకు 14 గంటలు పనిచేయించుకునే వెసులుబాటును కంపెనీలకు ఇవ్వబోతోందని, ఇందుకోసం 1961 నాటి కర్నాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని సవరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఒక వార్త బెంగుళూరు సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ప్రైవేట్‌ సెక్టార్‌లో రిజర్వేషన్లు తీసుకురావాలనే ప్రతిపాదన తీసుకొచ్చి.. ఇండస్ట్రీవర్గాలు తిరగబడ్డంతో భంగపడి వెనక్కు తగ్గింది సిద్ధరామయ్య సర్కార్. ఇప్పుడు పరిశ్రమవర్గాల్ని కూల్‌డౌన్ చెయ్యడం కోసం వర్కింగ్ అవర్స్ మీద కొత్త పెత్తనం మొదలుపెట్టిందనేది ఒకానొక అనుమానం. ముఖ్యంగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లోని ఉద్యోగులతో రోజుకు 14 గంటల వరకు పనిచేయించుకునేలా చట్ట సవరణ చెయ్యబోతోందట. దీంతో ఐటీ ఉద్యోగుల్లో నయా ఫికర్ పట్టుకుంది.

ఒక ఉద్యోగి వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలనేది కార్మిక చట్టంలో ప్రధాన నిబంధన. దీన్ని మార్చి పెట్టుబడిదారి పరిశ్రమ వర్గాలకు మేలు చేకూర్చాలన్నది సిద్ధరామయ్య ప్రభుత్వ ఆలోచన. ఇదే సమయంలో కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారన్నది అభియోగం. కొన్ని దుకాణాలు.. చిన్న తరహా పరిశ్రమల్లో అనధికారికంగా అదనపు గంటలు పనిచేయించుకుని, వేతనం విషయంలో దగా చేస్తున్నట్టు యజమానులపై ఫిర్యాదులొస్తున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారంగా.. అధికారికంగానే పనిగంటలు పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన.

పని గంటల పరిమితిని 12 గంటలకు పెంచుతున్నారన్న ఊసు వినిపించగానే.. ఐటీ కంపెనీలు మేలుకుని.. తమ బుర్రలకు పదును పెట్టేశాయి. మావాళ్లకు మరో రెండు గంటలు పెంచి 14 గంటలుగా నిర్ధారించాలని, ఆ మేరకు చట్టంలో సవరణ చేయాలని సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయట. 12 గంటల రెగ్యులర్ వర్క్.. ప్లస్ 2 గంటలు ఓవర్‌టైమ్.. వెరసి రోజుకు 14 గంటలు.. వారంలో ఐదురోజులకు కలిపి 70 గంటలు.. ఈలెక్కన ముూడొంతుల జీవితాన్ని పనిలోనే గడపాలి. ఇదే గనుక అమల్లోకి వస్తే.. ‘ఈ శతాబ్దంలో వర్కింగ్‌ క్లాస్‌పై జరిగే అతిపెద్ద దాడి ఇదే’ అంటూ ఐటీ ఎంప్లాయిస్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

కంపెనీలకు ప్లస్‌ పాయింట్‌

ఉద్యోగుల సంగతేమో గాని.. 14 పని గంటల నియమం కంపెనీలకు మాత్రం ప్లస్ పాయింటే. మూడు షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులను రెండు షిఫ్టులకే సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ఉద్యోగులపై పెట్టే ఖర్చు, జీతాల ఖర్చు తగ్గుతుంది. కానీ.. ఐటీ ఉద్యోగులకైతే తీవ్ర నష్టం తప్పదు. అందుకే.. ససేమిరా అంటోంది కర్నాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్-KITU. ఈ సవరణ జరిగితే.. 30 శాతం ఉద్యోగాలు ఊడిపోవడం గ్యారంటీ.. అనేది వీళ్ల వాదన.

70 Hour Work Week4

70 Hour Work Week

ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగి.. అనారోగ్యం బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల్లో 45 శాతం మందికి రకరకాల మానసిక రోగాలొచ్చి మనోవేదనతో కుంగిపోతున్నారు. 55 శాతం మంది ఉద్యోగులు శారీరక సమస్యలతో కునారిల్లిపోతున్నారు. ఒకవేళ ఈ బిల్లు పాసై పనిగంటలు పెరిగితే… 35 శాతం మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఒక సంస్థ అంచనా వేస్తోంది. మేమూ మనుషులమే.. మాకూ బతుకు మీద ఆశలుంటాయి.. అని ఆక్రోశిస్తున్నారు ఐటీ సెక్టార్‌లో ఉద్యోగులు. తాజా ప్రతిపాదనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ముగ్గురిని తీసుకోవాల్సిన చోట ఇద్దరికే ఉద్యోగాలిచ్చే పరిస్థితి ఏర్పడితే నిరుద్యోగం పెరుగుతుందని.. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుందని విమర్శలొస్తున్నాయి.

అగ్గిపుల్ల గీసిన ఐటీ కంపెనీలు

అగ్గిపుల్ల గీసి చోద్యం చూస్తున్న ఐటీ కంపెనీల సంగతేమో గాని.. ఐటీ ఉద్యోగులు మాత్రం అగ్గి బరాటాలౌతున్నారు. ఇప్పటికే.. ల్యాప్‌టాప్ సంకకే తగిలించుకుని.. ఇంట్లో-ఆఫీసుల్లో చివరాఖరికి వాష్‌రూముల్లో కూడా ఆన్‌డ్యూటీ అంటున్న ఐటీ ఉద్యోగులు.. 24 గంటలూ టార్గెట్లు మోస్తూనే ఉన్నారు. బాసులకు అందుబాటులోనే ఉంటున్నారు. టెక్నికల్‌గా రోజుకు 24 గంటల పని చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడది.. అధికారికం చేసే రోజు మరెంతో దూరుంలో లేదు!.

సగటు కార్మికుడ్ని కరుణించి ఆటవిడుపుగా ఆదివారాన్ని వరంగా ఇచ్చాడు పైవాడు. దానికి శనివారాన్ని కూడా కలుపుకుని, వీకెండ్‌ని రెండురోజులకు పెంచి 48 గంటల రిఫీఫ్ ఇచ్చాం పండగ చేస్కో అని ఐటీ కార్మికుల్ని ఫిదా చేశాయి కంపెనీలు. టెన్‌ టు సిక్స్‌ సిండ్రోమ్‌ నుంచి ఇప్పుడిప్పుడే బైటపడుతున్నాడు వేతనజీవి. ఆఫీసుల్ని వర్చువల్‌గా మార్చుకుని.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌కు అలవాటు పడుతున్నాడు. ఫ్యామిలీని-ఉద్యోగాన్నీ కలుపుకుని ఎలాగోలా సంకీర్ణ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. తమకు దక్కిన వీకెండ్స్‌ని కూడా దోచుకుంటామంటే సగటు ఐటీ ఉద్యోగి కడుపు మండిపోదా..?

నారాయణమూర్తి మాటల్లో అసలు అర్థం

సాటర్‌డే, సండే.. కామ్ నహీ కర్‌తా అని చెబితే ఊరుకునేది లేదు.. అని నౌక్రీ డాట్‌కామ్ ఛైర్మన్ సంజీవ్ బిఖ్‌చందనీ అనే పెద్దమనిషి ఉద్యోగుల్ని ఓపెన్‌గానే నిలదీశారు. ఇంటిలోన్లకు EMIలు కట్టుకోడానికి మీలో ఎంతమంది శని, ఆదివారాల్లో ఇంటిదగ్గరుండి సీక్రెట్‌గా పని చేస్తున్నారో మా దగ్గర లెక్కలున్నాయి.. అని హెచ్చరించారు కూడా. వారానికి 70 పనిగంటల పని అంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని సపోర్ట్ చేస్తూ ఇలా చాలామంది కార్పొరేట్ పెద్దలు బైటికొచ్చారు. కానీ.. ఇన్ఫోసిస్‌ మాజీ సీఈవో మోహన్‌దాస్‌ పాయ్‌తో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నారాయణమూర్తి చెప్పిందొకటి.. ఇప్పుడు వీళ్లు ఫాలో ఔతున్నదొకటి.

మిగతా దేశాలతో పోలిస్తే భారతీయుల ఉత్పాదక శక్తి చాలా తక్కువ. ఆ లోపాన్ని దాటుకోకపోతే.. మనం ముందుకెళ్లలేం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్‌ దేశస్తులు అదనపు గంటలు పనిచేయడం వల్లే నిలదొక్కుకున్నాయి.. అని ఫ్లాష్‌బ్యాక్ గుర్తు చేశారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. సంక్షోభ సమయాల్లోనే ఎక్స్‌ట్రా అవర్స్ పనిచేయాలన్న సూచన పక్కకెళ్లిపోయింది.. ఆయనన్న ఆ 70 గంటల సౌండ్‌ని మాత్రమే గట్టిగా పట్టుకున్నాయి దేశీయ ఐటీ కంపెనీలు.

ఏ దేశంలో ఎన్ని పని గంటలు?

ఆఖరికి పార్లమెంటులో కూడా 70 గంటల ప్రస్తావన వచ్చింది. ఈ 70 గంటల పనివారాన్ని ఒక నిబంధనగా మార్చే ఉద్దేశం ఏమన్నా ఉందా అని కేంద్రప్రభుత్వాన్ని ఆరా తీశారు తెలుగు రాష్ట్రాల ఎంపీలు. ఇప్పుడది కర్నాటక చట్టసభల దాకా వచ్చేసింది. ఆమాటకొస్తే.. వారానికి ఆరు రోజులు.. రోజుకు పన్నెండు గంటలు.. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు.. పనిచేసే తీరాలని చైనా బిలియనీర్ జాక్ మా.. నాలుగేళ్ల కిందటే ప్రపంచ ఉద్యోగ సమాజానికి ఉచిత సలహా ఇచ్చారు. ఈ ఆలీబాబా పెద్దాయన చెప్పిన 9-9-6 లెక్క ప్రకారం సగటు ఉద్యోగి వారానికి 72 గంటలు పనిచేయాలి.. ఇది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పిన 70 గంటల కంటే అదనం.

నిజానికి చాలా దేశాలతో పోలిస్తే.. 70 గంటలనేది నిజంగానే బిగ్‌ నంబర్. అమెరికా, చైనాల్లో సగటున 40 గంటలు మాత్రమే పనిచేస్తారు. జర్మనీ, జపాన్‌, దక్షిణ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 40 పని గంటలే. ఆస్ట్రేలియాలో 38 గంటలు. ఇలా పనిగంటల్ని 40 దాటకుండా చూసుకోడానికి ప్రధాన కారణం ఒకటుంది. మోతాదుకుమించి పని చేయడం మరణానికి దారితీస్తుంది. జపాను భాషలో ఈ మాటను క్లుప్తంగా కరోషి అంటారు. పని ఒత్తిడితో గుండెపోటు, పక్షవాతం, పోషకాహార లోపం లాంటి రుగ్మతలు ఏర్పడతాయని.. ఒక్కోసారి ఆత్మహత్యలకు దారితీస్తుందని ఆయాదేశాల్లో బలంగా నమ్ముతారు.

ఒక్క స్వీడన్లోనే ఏటా సగటున 770 మంది పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారు. చైనాలోనూ ఇదే దురవస్థ. మన దేశానిక్కూడా ఇటువంటి దౌర్భాగ్యం దాపురించాలా..? ఇప్పుడు కర్నాటక ముందుకొచ్చింది.. బెంగళూరు ఐటీ ప్రొఫెషనల్స్‌ మీద పగపట్టింది.. రేపటిరోజున మిగతా రాష్ట్రాలు, మిగతా మహానగరాలకు సైతం వర్కింగ్ అవర్స్ అనే వైరస్‌ పాకదని గ్యారంటీ ఏదైనా ఉందా..? ప్రొడక్టివిటీ తగ్గడమే కాదు.. ప్రాణాలు పోతున్నాయిక్కడ.. అంటూ ఆక్రోశిస్తున్నాడు సగటు ఉద్యోగి.

3×8 ఫార్ములా అంటే ఏంటి?

రోజుకు 14 గంటలు పనిచేస్తానని ఒక సాఫ్ట్‌వేర్ దిగ్గజం చెప్పుకుంటే అది ఆయనకు గొప్పయితే కావొచ్చు.. దానికి తగ్గ ప్రతిఫలం దక్కితే దక్కొచ్చు. కానీ.. ఒక ఉద్యోగి రోజుకు 14 గంటలు పనిచేయాలని ఆదేశిస్తే.. దానికసలు అర్థమే లేదు. పనిగంటలు పెరిగితే.. ప్రగతి కొత్త పుంతలు తొక్కుతుందో లేదో గాని.. ఉద్యోగి బతుకు మాత్రం దుర్భరమవ్వడం గ్యారంటీ. అందులోనూ ఆ పనికి మొక్కుబడిగా చేయాల్సి వస్తుంది. దీంతో సృజనాత్మకలోపిస్తుంది. పని భారం పెంచడం అంటే అతడికి బానిసత్వపు సంకెళ్లు తొడగడం.. అతడి బతుకును కబ్జా చేయడం.!

ఉద్యోగుల ఆరోగ్యం సవ్యంగా ఉండాలంటే త్రిబుల్‌ 8 ఫార్ములా అనేది తప్పనిసరి అంటున్నారు వైద్యులు. ఒక ఉద్యోగి రోజులో గరిష్ఠంగా ఎన్నిగంటలు పని చేయాలి అనే దానిపై కటాఫ్‌ అంటూ ఏదీ లేదు. ప్రస్తుతం వారంలో 48 గంటలకు మించి పనిచేయించకూడదని కార్మిక చట్టాలు చెబుతున్నాయి. తనకున్న 24 గంటల్నీ ఒక క్రమపద్ధతిలో వాడుకుంటేనే బతుకు సుఖమయమౌతుందంటారు. ప్రొఫెషన్‌కి 8 గంటలు.. నిద్రకు ఎనిమిది గంటలు.. ఇవి పోనూ మిగతా ఎనిమిది గంటలూ వ్యక్తిగత, సామాజిక జీవితాలకు ఖర్చు పెట్టాలి. ఇలా ట్రిపుల్-8 ఫార్ములాను పాటిస్తేనే బతుకు దుర్భరం కాకుండా కాపాడుకోని భవిష్యత్ తరాలకు కూడా మర్గదర్శకంగా నిలుస్తాం..!

ఫ్యాక్టరీల చట్టం ఏం చెబుతోంది?

1942లో బ్రిటిష్‌ వైస్రాయ్‌ కౌన్సిల్లో లేబర్‌ మెంబర్‌గా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కార్మికులకూ, ఉద్యోగులకూ రోజుకు 8 పని గంటలు ఉండాలని డిమాండ్‌ చేశారు. ‘1948 ఫ్యాక్టరీ చట్టం’ సెక్షన్‌ 54 ప్రకారం తొమ్మిది గంటల పని, విశ్రాంతి సమయాన్ని అంబేడ్కర్‌ కార్మికుల పక్షాన పోరాడి సాధించారు. భారత కార్మిక మంత్రిత్వ శాఖ రోజుకు12 పనిగంటలు ఉండాలని పార్లమెంట్‌లో చట్టం చేసినప్పటికీ… ‘ఇండియన్‌ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ –1948’ ఓవర్‌ టైంతో కలిపి 50 నుంచి 60 పని గంటలు దాటకూడదనే నిబంధన కచ్చితంగా పాటించాలని చెప్పింది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం, అంచనాల ప్రకారం వారానికి 55 గంటలు దాటి పని చేసిన వారిలో ప్రతి పది మందిలో ఒక కార్మి కుడు గుండె పోటుతో మరణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 7,45,000 మంది కార్మికులు గుండెపోటుతో మరణించినట్లు నివేదించింది. దీనికి కారణం ఎక్కువ పని చేయడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థల సంయుక్త నివేదిక కఠోర వాస్తవాన్ని వెల్లడించింది.

70 Hour Work Week5

70 Hour Work Week

రోజుకు 14 గంటలు పని చేయడం అంటే అనేక వ్యాధులు కొని తెచ్చుకున్నట్టే. ఒకే దగ్గర గంటల కొద్దీ కూర్చోవడం వల్ల నడము నొప్పి, కండ్ల నొప్పి వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. బ్రెయిన్‌ ఫాగ్‌ అంటే మెదడు అలసిపోతుంది. దాంతో మెదడు సామర్థ్యం మందగిస్తుంది. మానసికంగా అలసిపోతాడు. నిద్ర, ఆకలిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల గుండె మీద ఎఫెక్ట్‌ చూపుతుంది. ఒంటరి తనానికి గురవుతాడు. డిప్రెషన్‌, యాంగ్జైటీ వంటి భారిన పడతాడు.

ఒకేచోట ఎక్కువ గంటలు పని చేయడం వల్ల మానవ సంబంధాల్లో కూడా సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కుటుంబం విషయంలోగాని, సమాజంలో కలివిడిగా ఉండే విషయంలో గానీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇటు భౌతికంగా, ఆటు మానసికంగా ఎఫెక్ట్‌ పడే ప్రమాదం ఉంది. ఈ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ ఆంశాలను వేటిని పరిగణలోకి తీసుకోకుండా పెట్టుబడి వర్గాలు ఒకవేళ పనివేళలు పెంచితే మరోమారూ భారతదేశంలో కార్మికులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ