
ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు మీ డీటైల్స్‌లో తప్పుడు వివరాలు నమోదైతే వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కేవైసీ ధృవీకరణ ప్రక్రియలో మీరు ఇబ్బందులు పడవచ్చు. ఒక్కొ ధృవీకరణ పత్రంలో ఒక్కొరకంగా వివరాలు ఉండటం సమస్యలు ఎదురవుతాయి. ఇప్పట్లో ప్రతీ పనికి ఆధార్ అనేది తప్పనిసరి అయింది. దీంతో ఆధార్‌లోని వివరాలను మార్చుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఉండవు. అయితే ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ కొన్ని పరిమితులు విధించింది. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ కార్డుల్లోని పేరు, డేట్ ఆఫ్ బర్త్‌కు సంబంధించి యూఐడీఏఐ కొన్ని కండీషన్స్ పెట్టింది. వాటిని మార్చుకునేందుకు కొన్ని పరిమితులు పెట్టింది. అంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మార్చుకోవడానికి కుదరదు. పేరు కేవలం రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ అయితే కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ కొన్ని నిబంధనలను రూపొందించింది.
-పేరును జీవితకాలంలో రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు
-డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మాత్రమే ఛేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంది
-లింగాన్ని ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు
-అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితులు విధించలేదు
ఇక పరిమితులు దాటిన తర్వాత ఏదైనా పొరపాట్లు ఉండి వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ రిజినల్ ఆఫీస్‌ను సంప్రదించాలి. అక్కడి అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించాక అనుమతి జారీ చేస్తారు. ఇక ఆధార్‌లో మార్పులు చేయాలంటే అందుకు అవసరమైన ప్రూఫ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక మెయిల్ ద్వారా కూడా మీరు యూఐడీఏఐ అధికారులను సంప్రదించవచ్చు. అందుకే ఆధార్ కార్డులోని వివరాలు మార్చుకునేముందే కరెక్ట్‌గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడమే మంచిది.