NPS Vatsalya: పిల్లల భవిష్యత్ కోసం మెరుగైన పథకం.. వాత్సల్యతో వచ్చే లాభాలెన్నో..!
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాలు సగటు మధ్యతరగతి కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల చదువుల ఖర్చులు తల్లిదండ్రులు ఆలోచిస్తే ఆందోళన చెందుతున్నారు. ఖర్చులు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ఎలా? అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ అవసరాలకు ఇప్పటి నుంచే పొదుపు చేసుకునే ఓ కొత్త పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల వాళ్లు తమ పిల్లల భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో పొదుపు చేయడంలో తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం గత సంవత్సరం వినూత్నమైన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది. ఖాతాదారులకు నెలవారీ పొదుపును అలవాటు చేయడంతో పాటు వారి పిల్లల భవిష్యత్‌ను ఈ పథకం ద్వారా మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పొదుపు-కమ్-పెన్షన్ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్‌డీఏ) నియంత్రిస్తుంది. ఈ పథకంలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు. అలాగే పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత విద్య, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య (ఎన్‌పీఎస్ వాత్సల్య) అనేది ఒక నెలవారీ కాంట్రిబ్యూటరీ పథకం. ఇది తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డబ్బు ఆదా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు గరిష్ట పరిమితి లేకుండా నెలకు కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును పెంపొందించడానికి సహాయపడుతుంది. ఆ పొదుపు చేసిన సొమ్మును భవిష్యత్తులో వారి విద్య కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. మీ పిల్లలకు బిడ్డకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ ఖాతాను సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా సులభంగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు నిండిన తేదీ నుంచి మూడు నెలల్లోపు కొత్త కేవైసీని పూర్తి చేయాలి.
ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా తెరవడం ఇలా
- మీరు మీ మైనర్ పిల్లల కోసం సులభంగా, త్వరిత ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవవచ్చు.
- అధికారిక ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌కి వెళ్లి, ఎన్‌పీఎస్ వాత్సల్య కోసం మూడు సీఆర్ఏలలో ఒకదానిని ఎంచుకోవచ్చు. ప్రోటీన్, కిఫిన్ టెక్, సీఏఎంఎస్ ఎంపికల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
- మీరు సీఏఎంఎస్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది.
- ఎన్‌పీఎస్ వాత్సల్య(మైనర్) కింద పేరు, పుట్టిన తేదీ, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి పాన్, సంరక్షకుడి పుట్టిన తేదీ, సంరక్షకుడి ఈ-మెయిల్ ఐడీ, సంరక్షకుడి మొబైల్ నంబర్‌తో సహా అన్ని వివరాలను నమోదు చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అన్ని వివరాలను నింపిన తర్వాత దిగువన ఉన్న ఓపెన్ ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతా ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- ఈ ఖాతా మైనర్ పేరుతో తెరుస్తారు. ముఖ్యంగా ఆ వ్యక్తికి 18 ఏళ్లు వచ్చే వరకు వారి సంరక్షకుడి ద్వారా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతటా మైనర్ ఏకైక లబ్ధిదారుడిగా ఉంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




