కృష్ణా నది జలాలపై తేలని పంచాయితీ.. ఏళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని సమస్యలు.. పోస్ట్‌మెన్‌గా మారిన కేఆర్ఎంబీ..!

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పాత్రపై తెలంగాణ ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. కృష్ణా నది జలాల విషయంలో సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తోందని అపవాదును మూటగట్టుకుంటుంది.

కృష్ణా నది జలాలపై తేలని పంచాయితీ.. ఏళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని సమస్యలు.. పోస్ట్‌మెన్‌గా మారిన కేఆర్ఎంబీ..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 7:02 PM

Krishna River Water Disputes : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ జలవనరుల శాఖ రాసిన లేఖల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు పోస్ట్ మెన్ జాబ్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ అభ్యంతరాల విషయంలో పరిష్కారానికి కృషి చేయాల్సిన కేఆర్ఎంబీ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పాత్రపై తెలంగాణ ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. కృష్ణా నది జలాల విషయంలో సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తోందని అపవాదును మూటగట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో కేఆర్ఎంబీ జోక్యం మంచిదే అయినా… సమస్యల పరిష్కారం కూడా వేగంగా జరగాలని ఇరు రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. అయితే కేఆర్ఎంబీ వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కృష్ణా, గోదావరి జల వివాదాలు కొనసాగుతూనే ఉంది. ఇందులో ప్రధానంగా కృష్ణానది జల వివాదాలు ఇప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. కృష్ణా జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. వాటిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖలు రాస్తోంది. ఇప్పటివరకు దాదాపు తెలంగాణ నీటిపారుదల శాఖ 10 లేఖలు రాసింది. అయినా… అవి పరిష్కారానికి నోచుకోలేదు. చివరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖలు రాయడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన ఇప్పటివరకు సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారాయి.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా లను ఇదివరకే నిర్ణయించారు. కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తున్న నీరు 2,060 టీఎంసీలు. అంచనా వేసిన 2,060 టీఎంసీల నికర జలాలను 1976లో ట్రిబ్యునల్ ఆయా రాష్ట్రాల వారీగా పంపకం చేసింది. ఇందులో మహారాష్ట్రకు 560 టి.ఎం.సి లు, కర్ణాటక రాష్ట్రానికి 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 800 టీఎంసీలుగా నిర్ణయించారు. ఈ నీటికి అదనంగా నదిలో 70 టీఎంసీలు ఊట (రీజనరేటివ్ ఫ్లో) ఉంటుందని కూడా అంచనా వేసారు. అయితే, ఈ నీటిని కూడా పంచాలంటే ఒత్తిడి రావడంతో మూడు రాష్ట్రాలకు వాటా రూపంలో పంకాలు జరిగాయి. అవి ఇలా ఉన్నాయి…

  • మహారాష్ట్ర: 585 టీఎంసీలు
  • కర్ణాటక: 734 టీఎంసీలు
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్: 811 టీఎంసీలు

పంపకాల మొత్తాలకు మించి ప్రవహించే అదనపు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. అయితే ఈ అధిక జలాలపై హక్కును మాత్రం ఆంధ్రప్రదేశ్ పొందలేదు.

ఇదిఇలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… 811 టీఎంసీల నీటిలో ఏపీకి 58 శాతం అంటే 512 టీఎంసీ లు, తెలంగాణకు 42 శాతం అంటే 299 టీఎంసీల నీటి కేటాయింపులను చేశారు. అదేవిధంగా ఈ ఏడాది వాడుకోని నీటిని వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని తెలంగాణ మొదటినుంచి కోరుతోంది. పూర్తిస్థాయిలో దీని పైన ఒక నిర్ణయం ఇప్పటివరకు జరగలేదు.

నీటి కేటాయింపుల విషయంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరడం లేదు. ప్రధానంగా సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాని పైన దృష్టి సారించి అప్పటి వరకు తాత్కాలికంగా ఒప్పందం చేసుకుంటున్నాయి రెండు రాష్ట్రాలు. ఇంత వరకు బాగానే ఉన్నా… ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కడతాం అంటూ ప్రణాళికలు సిద్ధం చేస్తే, తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టును కడతామంటూ హెచ్చరికలు చేసింది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిని బేస్ చేసుకొని కొత్త ప్రాజెక్టులకు తెర లేపుతోంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర, హంద్రీనీవా ప్రాజెక్టులను కట్టడం, సామర్థ్యం పెంపులాంటి వాటికి పూనుకుంటుంది.

ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. తెలంగాణ జలవనరుల శాఖ ఈ మేరకు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్‌కు పలు లేఖలు రాసింది. ఆ లేఖలను యథాతథంగా కోట్ చేస్తూ ఏపీ జలవనరుల శాఖ కు వివరణ ఇవ్వాల్సిందిగా లేఖలు రాసింది కేఆర్ఎంబీ. కానీ కృష్ణా బోర్డు మాత్రం మీనవేశాలు లెక్కిస్తుంది. ఆ లేఖలకు ఏపీ ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు. అయినా ఏపీ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇదిలావుంటే… ఏపీ జలవనరుల శాఖ రాసిన ఫిర్యాదు లేఖలపై కేఆర్ఎంబీ స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ లేఖ రాసింది. కృష్ణ నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని ఏపీ ఫిర్యాదుచేసింది. మొత్తం 8 ప్రాజెక్టులపై అభ్యంతరాలు లేవనెత్తింది ఆంధ్రప్రదేశ్. కేఆర్ఎంబీ లేఖలో 5 కొత్త ప్రాజెక్టులు, 3 ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పేర్లను ప్రస్తావించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ భగీరథ, తుమిళ్లతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్‌బీసీ, నెట్టెంపాడు ప్రాజెక్టు ల ప్రస్తావన చేసింది కేఆర్ఎంబీ. ఈ ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని ఏపీ ఫిర్యాదు లో పేర్కొంది. సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖలో కోరింది.

ఇలా ఇకటి కాదు రెండు పదుల సంఖ్యలో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ జలవనరుల శాఖ రాసిన లేఖల విషయంలో కేఆర్ఎంబీ అధికారులు పోస్ట్ మెన్ జాబ్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ అభ్యంతరాల విషయంలో పరిష్కారానికి కృషిచేయాల్సిన కేఆర్ఎంబీ అధికారుల తీరుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ కో న్యాయం, తెలంగాణకు న్యాయమా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇకప్పటికైనా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్వతంత్రంగా వ్యవహరించి రెండు తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని నిపుణులు కోరుతున్నారు.

Read Also…  తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు.. పండగ.. సీఎం కేసీఆర్‌ కృషికి వారి సహకారం కావాలన్న మంత్రులు