ఎయిర్‌లైన్స్‌కు కేంద్రం సీరియస్ వార్నింగ్

లాక్ డౌన్ ముగింపు తేదీలకు అనుగుణంగా విమాన ప్రయాణ టిక్కెట్లను జారీ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న ఎయిర్ లైన్స్ సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. టిక్కెట్లను ఎప్పుడు జారీ చేయాలో కేంద్రం నిర్ణయించి...

  • Rajesh Sharma
  • Publish Date - 8:27 pm, Sun, 19 April 20
ఎయిర్‌లైన్స్‌కు కేంద్రం సీరియస్ వార్నింగ్

లాక్ డౌన్ ముగింపు తేదీలకు అనుగుణంగా విమాన ప్రయాణ టిక్కెట్లను జారీ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న ఎయిర్ లైన్స్ సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. టిక్కెట్లను ఎప్పుడు జారీ చేయాలో కేంద్రం నిర్ణయించి, ప్రకటించే వరకు టిక్కెట్ల జారీ మొదలు పెట్టొద్దని తేల్చి చెప్పింది. తరచూ టిక్కెట్లను జారీ చేస్తూ, వాటిని రద్దు చేస్తూ ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించవద్దని తెలిపింది.

లాక్ డౌన్ తొలి రోజుల నుంచి విమాన యాన సంస్థలు గడువు ముగింపు తేదీని దృష్టిలో వుంచుకుని, ఆ మర్నాటి నుంచి విమాన ప్రయాణాలు కొనసాగుతాయన్న ఇంప్రెషన్ ఇస్తూ టిక్కెట్లను విక్రయిస్తున్నాయి. తీరా లాక్ డౌన్ పొడిగించే సరికి టిక్కెట్ మొత్తం నుంచి ఎంతో కొంత మినహాయించి ప్రయాణీకులకు డబ్బులు తిరిగి చెల్లిస్తున్నాయి.

కొన్ని సార్లు ఎక్కువ అమౌంట్ కట్ చేస్తున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో మొత్తం సొమ్ము (వంద శాతం)ను తిరిగి చెల్లించాలని మోదీ ప్రభుత్వం విమానయాన సంస్థలకు, టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తుందన్న నమ్మకంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు, టిక్కెటింగ్ ఏజెన్సీలు మే నాలుగో తేదీ నుంచి ప్రయాణాలకు వీలు కల్పిస్తూ టిక్కెట్లను జారీ చేస్తున్నాయి.

అయితే దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కంట్రోల్‌లోకి రాకపోవడంతో మే మూడవ తేదీ తర్వాత దేశంలో లాక్ డౌన్ పొడిగించడమో, లేక పాక్షికంగానే ఎత్తివేయడమో చేసే ఆలోచనలో కేంద్రం వున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ టిక్కెట్లు జారీ చేయడం, వాటిని కాన్సిల్ చేయడం వల్ల ప్రయాణీకులకు అసౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశంతోనే మోదీ ప్రభుత్వం విమానయాన సంస్థలకు, టిక్కెటింగ్ ఏజెన్సీలకు సీరియస్ హెచ్చరిక జారీ చేసింది.

ఈ మేరకు ఎయిర్ లైన్స్  సంస్థలను, ఏజెన్సీలకు ఆదివారం హెచ్చరిక జారీ చేసింది డీజీసీఏ. మే 4 తర్వాత తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు డొమెస్టిక్, అంతర్జాతీయ విమానాల కోసం ఎలాంటి బుకింగ్ తీసుకోకుండా ఉండాలని  హెచ్చరించింది. టిక్కెట్ల జారీని ప్రారంభించడానికి విమానయాన సంస్థలకు తగిన సమయం, నోటీసు ఇస్తామని వెల్లడించింది.