AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా..రుణాలపై 3 నెలల మారటోరియం.. రెపో రేటు కుదింపు.. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం..

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా  అమలవుతున్న లాక్ డౌన్ మూడో రోజుకు చేరిన వేళ.. దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రిజర్వ్ బ్యాంకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేరుగా రంగంలోకి దిగింది.

కరోనా..రుణాలపై 3 నెలల మారటోరియం.. రెపో రేటు కుదింపు..  రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం..
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 12:26 PM

Share

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా  అమలవుతున్న లాక్ డౌన్ మూడో రోజుకు చేరిన వేళ.. దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రిజర్వ్ బ్యాంకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేరుగా రంగంలోకి దిగింది. రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు, రివర్స్ రెపో రేటు 90 పాయింట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 4.4 శాతం, రివర్స్ రెపో రేటు 4 శాతానికి చేరింది. నిజానికి రెపో రేటు కుదింపు అత్యంత కీలక నిర్ణయం.. గత ఏడాది ఆగస్టులో భారీ కుదింపు 35 బేసిస్ పాయింట్లుగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, ఈ నేపథ్యంలో రుణాలపై 3 నెలల మారటోరియాన్ని విధిస్తున్నామని ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు.  బ్యాంకు మానిటరింగ్ పాలసీ కమిటీ అత్యవసరంగా సమావేశం కావడం కూడా ఈ సందర్భంగా చెప్పుకోదగిన అంశం. నిజానికి ఈ కమిటీ బై మంత్లీ రివ్యూ వచ్ఛే నెలారంభంలో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ భేటీ అయింది. రిజర్వ్ బ్యాంకు తీసుకున్న చర్యలకు  ఈ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు పూర్తిగా ఆమోదం తెలిపారు. కరోనా వ్యాప్తి, దాని తీవ్రత లేదా ప్రభావం ఎంతకాలం ఉండవచ్చన్న అంశాలతో బాటు భవిష్యత్ వృద్ది రేటు, ద్రవోల్బణ అంచనాలను తాము మదింపు చేసినట్టు శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకుల సీ ఆర్ ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో) ని ఏడాది కాలానికి గాను 100 బేసిస్ పాయింట్లు తగ్గించడం కూడా ప్రధానాంశం. అంటే ఫలితంగా దీనివల్ల రూ. 1,37 వేల కోట్ల విలువైన లిక్విడిటీ వాణిజ్య బ్యాంకులకు విడుదలవుతుందని ఆయన వివరించారు. అన్ని రుణాల  మీదా మూడు నెలల మారటోరియాన్ని అనుమతించడానికి అన్ని కమర్షియల్ బ్యాంకులకు వీలవుతుందని ఆయన ప్రకటించడం ముఖ్యంగా మధ్యా దాయవర్గాలకు ఊరటనిచ్ఛే అంశం.

ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో దేశంలోని సుమారు 130 కోట్లమంది ప్రజలను కరోనా విపత్కర పరిస్థితి నుంచి రక్షించడానికి ఈ చర్య తోడ్పడుతుందని భావించవచ్చు. పైగా బ్యాంకులు తమ రుణ  సామర్థ్యాన్ని కొనసాగించడానికికూడా ఈ నిర్ణయం దోహదపడే అవకాశం ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థను పరిరక్షించాలంటే వాటాదారులంతా కరోనాపై   ఉమ్మడిగా పోరాటం జరపాల్సిన అవసరం ఉందని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. ఈ చాలెంజింగ్ పరిస్థితుల్లో మన బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా ఉండడం గమనించదగిన విషయమన్నారు. ఇది ఇలాగే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశ ఎకానమీ కోసం ఆర్ బీ ఐ ఇదివరకే 2.7 లక్షల కోట్లను విడుదల చేసింది. ఆర్ బీ ఐ కి సంబంధించి జీడీపీలో ఓవరాల్ లిక్విడిటీ 3.2 శాతం ఉండడం గమనించదగిన విషయం. మన ఎకానమీపై కరోనా ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలన్నింటినీ తాము తీసుకున్నట్టు శక్తికాంత్ దాస్ వెల్లడించారు.