సీన్ మళ్ళీ మొదటికి ! ఆ దోషులకు 22 న ఉరి లేనట్టే ?

నిర్భయ కేసు దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాల ఉరికి ఈ నెల 22 న బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. ఆ రోజున  వీరిని ఉరి తీయబోవడంలేదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ మంగళవారం మెర్సీ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్ ని తిరస్కరించినప్పటికీ ఉరి శిక్ష అమలుకు 14 రోజుల ముందు నోటీసు జారీ చేయవలసి ఉంటుందని అందులో పేర్కొన్నాడు. తన […]

  • Umakanth Rao
  • Publish Date - 4:01 pm, Wed, 15 January 20
సీన్ మళ్ళీ మొదటికి ! ఆ దోషులకు 22 న ఉరి లేనట్టే ?

నిర్భయ కేసు దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాల ఉరికి ఈ నెల 22 న బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. ఆ రోజున  వీరిని ఉరి తీయబోవడంలేదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ మంగళవారం మెర్సీ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్ ని తిరస్కరించినప్పటికీ ఉరి శిక్ష అమలుకు 14 రోజుల ముందు నోటీసు జారీ చేయవలసి ఉంటుందని అందులో పేర్కొన్నాడు.

తన డెత్ వారెంట్‌ని ముందుగానే జారీ చేశారని ఇతడు తన పిటిషన్లో తెలిపాడని  ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది రాహుల్ మెహ్రా, కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్.. హైకోర్టుకు వివరించారు. . వీరి వాదనను న్యాయమూర్తులు మన్మోహన్, సంగీత సెహగల్‌తో కూడిన బెంచ్ ఆలకించింది. సంబంధిత నిబంధనల కింద డెత్ వారెంట్ అమలుకు ముందు ఈ దోషి వేసిన క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేంతవరకు తీహార్ జైలు వేచి ఉండాల్సిఉంటుందని రాహుల్ మెహ్రా పేర్కొన్నారు. రాష్ట్రపతి ఈ పిటిషన్‌ను తిరస్కరించిన అనంతరమే దోషికి మరణశిక్ష ఖరారవుతుందని అన్నారు. ఈ పిటిషన్ పై నిర్ణయం వెలువడేవరకూ వీరిలో ఎవరినీ ఉరి తీయజాలరని ఆయన చెప్పారు.

తమ క్షమాభిక్ష పిటిషన్లను వేర్వేరుగా దాఖలు చేయడంలో ఈ దోషులు పాటించిన విధానం చట్ట ప్రక్రియను నీరు గార్చే వ్యూహంలో భాగమేనని మెహ్రా వ్యాఖ్యానించారు. ముకేష్ , వినయ్‌ల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ముకేశ్ దాఖలు చేసిన మెర్సీ పిటిషన్‌ని వెంటనే తిరస్కరించామని, ఆమోదం కోసం దీన్ని  లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా తెలిపారు.  కాగా-లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దీనిని తిరస్కరించి మళ్ళీ కేంద్ర హోం శాఖకు పంపాల్సి ఉంటుంది. ఆ శాఖ నుంచి ఇది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరుతుంది.

అటు-మరో ఇద్దరు దోషులైన అక్షయ్, పవన్ క్యురేటివ్ పిటిషన్లను ఇంకా దాఖలు చేయలేదు. వారికి  ఆ అవకాశం ఉందని అంటున్నారు. క్యురేటివ్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించినప్పటికీ.. దోషులు  క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతికి దాఖలు చేసుకోవచ్చు.

డెత్ వారెంట్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

నిర్భయ కేసు దోషుల ఉరితీతకు సంబంధించి జారీ చేసిన డెత్ వారెంట్ ను కొట్టివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ వారెంట్ మీద స్టే ఇచ్ఛే ప్రసక్తే లేదని, అయితే దోషి ముకేశ్ సింగ్ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చునని పేర్కొంది. ఈ దోషులు నలుగురినీ ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ లో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. కాగా.. ముకేశ్ తరఫు లాయర్ రెబెకా జాన్ తన క్లయింటు అభ్యర్థనను ఉపసంహరించుకుం‌టున్నట్టు తెలిపారు. అయితే ఈ కేసులో ఇటీవలి పరిణామాలపై తగిన సమాచారంతో ట్రయల్ కోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు.