టీవీ9 రిపోర్టర్ ని కిడ్నాప్ చేసిన బిజెపి నేత..ఎక్కడంటే..?
బిజెపి నేత చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ట్రై చేసిన టీవీ9 విలేకరిని, అతని సోదరుడు, కెమెరామాన్ ని దారుణంగా కొట్టి, కిడ్నాప్ చేసిన ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సుమారు 20 ఏళ్ళుగా ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా వున్న బిజెపి నేతల అక్రమాలపై కథనం చేయడమే టీవీ9 రిపోర్టర్ తప్పు. గుజరాత్ లోని బనస్కంత ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఎయిడెడ్ ఆశ్రమ పాఠశాలలను నడుపుతున్న బిజెపి నేత, అతని సోదరుడు గత […]
బిజెపి నేత చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ట్రై చేసిన టీవీ9 విలేకరిని, అతని సోదరుడు, కెమెరామాన్ ని దారుణంగా కొట్టి, కిడ్నాప్ చేసిన ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సుమారు 20 ఏళ్ళుగా ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా వున్న బిజెపి నేతల అక్రమాలపై కథనం చేయడమే టీవీ9 రిపోర్టర్ తప్పు. గుజరాత్ లోని బనస్కంత ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
ప్రభుత్వ ఎయిడెడ్ ఆశ్రమ పాఠశాలలను నడుపుతున్న బిజెపి నేత, అతని సోదరుడు గత కొంత కాలంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో స్థానికులిచ్చిన సమాచారం మేరకు వారితో మాట్లాడేందుకు టీవీ9 రిపోర్టర్ కుల్ దీప్ కుమార్, అతని సోదరుడు, కెమెరామాన్ అశోక్ శుక్రవారం బనస్కంత జిల్లా దంత తాలూకాలోని కున్వర్సీ గ్రామానికి వెళ్ళారు. ఆశ్రమ పాఠశాలలో కవరేజీకి వెళ్ళిన సందర్భంలో స్కార్పియో వాహనంలో వచ్చిన బిజెపి వచ్చిన బిజెపి నేత, అతని అనుచరులు కుల్ దీప్, అశోక్ లపై కర్రలతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి కారులో పడేశారు. అక్కడికి సమీపంలోని రంగ్ పూర్ లో వున్న బిజెపి నేత లక్ష్మణ్ బరాద్ ఫామ్ హౌజ్ కు వీరిద్దరిని తరలించారు.
అక్కడ లక్ష్మణ్ బరాద్ తమ్ముడు వదన్ సిన్హ్ బరాద్.. కుల్ దీప్, అశోక్ లను మరోసారి తీవ్రంగా కర్రలతో కొట్టారు. అంతటితో ఆగకుండా.. ఆల్కహాల్ బాటిళ్ళను ఒక మహిళతో తెప్పించి, వాటిని, ఆ మహిళను టీవీ9 రిపోర్టర్, కెమెరామాన్ల పక్కన కూర్చోపెట్టి ఫోటోలు తీశారు. ఫోటోలను లీక్ చేసి, ఉద్యోగాలు పోగొడతానని వదన్ బెదిరించాడు. ఈలోగా సమాచారం అక్కడి గ్రామాల్లో లీక్ అవడంతో.. పోలీసులకు సమాచారం అందింది. వదన్, లక్ష్మణ్ లకు ఫోన్ కాల్స్ రావడంతో కుల్ దీప్, అశోక్ లను రంగ్ పూర్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారని బాధితులు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పాలన్ పూర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బనస్కంత జిల్లాలోని 30 ఆశ్రమ పాఠశాలల నిర్వహిస్తున్న లక్ష్మణ్ బరాద్ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందుతూ విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదన్న స్థానికుల ఆరోపణల మేరకు స్టోరీ చేసేందుకు వెళ్ళామని కుల్ దీప్ తెలిపాడు. అయితే ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని బనస్కంత జిల్లా ఎస్పీ గౌరవ్ దుగ్గల్ తెలిపారు.