#covidindia వాఘా బోర్డర్‌లో మనోళ్ళు… రావద్దంటున్న అధికారులు
ఇండియన్సే కానీ ఇండియాలోకి రావద్దు. కరోనా లేకున్నా సరే.. ఇప్పటికిప్పుడు ఇండియాలోకి రావద్దు. తిరిగి వెళ్ళి పాకిస్తాన్ నుంచి విమానంలోనే తిరిగి భారత్‌కు చేరుకోవాలి. బీఎస్ఎఫ్ అధికారులు అనుమతించకపోవడంతో 29 మంది భారతీయులు ఇండో-పాక్ సరిహద్దు వాఘాలో చిక్కుకుపోయారు.
Indian travellers coming from Pakistan stopped at Wagha border: వాళ్ళంతా ఇండియన్స్… పాకిస్తాన్ వెళ్ళి తిరిగి వస్తున్నారు.. అంతలోనే కరోనా అలర్ట్… అంతే.. మీరు ఇండియన్సే అయినా.. భారత్‌లోకి మాత్రం రావద్దు. ఇది బుధవారం భారత్-పాకిస్తాన్ వాఘా బోర్డర్‌లో జరిగిన సంఘటన. దాంతో వాఘా బోర్డర్‌లో 29 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో చాలా మంది తెలుగువాళ్ళున్నారు. ఇంతకీ కథేంటంటారా?
పీఎస్ఎల్ ప్రాజెక్టు కోసం పాకిస్తాన్ వెళ్ళిన 29 మంది భారతీయులు పని ముగించుకుని కొన్ని రోజుల క్రితం తిరిగి పయనమయ్యారు. అయితే కరోనా ఎఫెక్టుతో పాకిస్తాన్‌లో పలు అంతర్జాతీయ, జాతీయ విమానాలను రద్దు చేశారు. దాంతో వీరంతా రోడ్డు మార్గంలో అతికష్టం మీద వాఘా బోర్డర్‌కు చేరుకున్నారు బుధవారం ఉదయం. వీరిని గమనించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు వీరందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. మొత్తం 29 మందికి కరోనా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. దాంతో ఇక తాము బోర్డర్ దాటి తమ దేశంలోకి వెళ్ళిపోవడమేనని ఆనందపడ్డారు.
కానీ.. బీఎస్ఎఫ్ అధికారులు మాత్రం వీరి రాకను తిరస్కరించారు. తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోయి విమానంలోనే రావాలని చెప్పారు. దాంతో 29 మంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి కుటుంబీకులకు ఫోన్లు చేశారు. దాంతో 29 మంది కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ వారిని దేశంలోకి అనుమతించాలని కోరుతున్నారు. కాగా.. పాకిస్తాన్‌లో కరోనా చాలా వేగంగా ప్రబలుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మరిన్ని వైద్య పరీక్షల తర్వాతనే.. ప్రాపర్ రూట్‌లో రావాలని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ వారిని తిరిగి రప్పించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాని అర్థిస్తున్నారు.