హైదరాబాద్‌లో కోటి స్వాధీనం.. బీజేపీ అభ్యర్థివేనంటున్న సీపీ
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగుకు ముందు బీజేపీ వరుసగా షాకులు తగులు తున్నాయి. ఎన్నికలకు రెండ్రోజుల ముందు పార్టీ కీలక నేత శ్రీధర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు చెందినవిగా చెబుతున్న కోటి రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.
Hyderabad police seized Crore rupees: హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. హవాలా సొమ్ముగా భావిస్తున్న ఈ నగదు దుబ్బాక ఉప ఎన్నికల్లో పంపిణీకి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుదేనని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఓటర్లకు పంచడానికి బీజేపీ నేతలే ఈ మనీని తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనున్నది. ఆ తర్వాత తెరచాటు రాజకీయం ప్రారంభం అవుతుందన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కోటి రూపాయల కరెన్సీని టాస్క్ పోర్స్ పోలీసులు పట్టుకోవడం విశేషం.
హైదరాబాద్ నార్త్ జోన్ ఏరియాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఈ హవాలా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురభి శ్రీనివాస్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ డబ్బును దుబ్బాకకు తీసుకుపోతున్నట్లుగా తేలిందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. సురభి శ్రీనివాస్ రావు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు స్వయానా బావమరిది అని పోలీసులు పేర్కొన్నారు. ఇన్నోవా కారులో డబ్బును తరలిస్తున్నారని, ఆ వెహికల్ డ్రైవర్ రవి కుమార్‌ను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
వీరిద్దరిని విచారించామని, వారి ఫోన్లను పూర్తిగా పరిశీలించగా… కోటి రూపాయల డబ్బు దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించినదని తేలినట్లు కమిషనర్ తెలిపారు. కోటి రూపాయల మొత్తాన్ని బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ నుంచి దుబ్బాకకు తరలిస్తున్నట్లుగా విచారణలో తేలిందని సీపీ తెలిపారు. విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వివేక్ వెంకట స్వామి కూడా బీజేపీ నేతనేనని కమిషనర్ తెలిపారు.
ALSO READ: పోలవరం ప్రొగ్రెస్ మా ఘనతే: చంద్రబాబు
ALSO READ: కేంద్రంపై కేటీఆర్ ధ్వజం
ALSO READ: బీజేపీకి రావుల గుడ్‌బై.. కమలానికి షాక్
ALSO READ: సిటీలో తెరుచుకున్న మల్టిప్లెక్సులు.. రోజుకు 3 ఆటలు