వారం రోజుల్లో గుడ్‌న్యూస్.. వేచి వుండాలన్న కేసీఆర్

మరో వారం రోజుల్లో ఎవరూ ఊహించని గుడ్ న్యూస్‌ను తెలంగాణ ప్రజలకు వినిపించ బోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. యావత్ తెలంగాణ రైతాంగం ఆనందంతో సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా...

వారం రోజుల్లో గుడ్‌న్యూస్.. వేచి వుండాలన్న కేసీఆర్

KCR to announce good news for entire Telangana people: మరో వారం రోజుల్లో ఎవరూ ఊహించని గుడ్ న్యూస్‌ను తెలంగాణ ప్రజలకు వినిపించ బోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. యావత్ తెలంగాణ రైతాంగం ఆనందంతో సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా తాను ప్రకటించే శుభవార్త వుండబోతుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ను, మర్కూక్ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్… శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ రామానుజ స్వామి వారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాల్వలు, రిజర్వాయర్లు, లిఫ్టు పథకాలు, చెక్ డ్యాముల నిర్మాణాలు, వాగులు వంకల మరమ్మతులపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

మధ్యాహ్నం కొండపోచమ్మ రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు యావత్ తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని, వ్యవసాయ రంగ సమగ్ర చిత్రాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చారు. మల్టీ లెవెల్ లిఫ్టింగ్ స్కీములను వేగంగా పూర్తి చేయడమనేది అంత ఈజీ టాస్క్ కాదని పేర్కొన్న ముఖ్యమంత్రి.. కేవలం 3,4 ఏళ్ళ కాలంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంజనీర్లకు, నిర్మాణ సంస్థలకు పేరుపేరునా అభినందనలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాకముందే తెలంగాణ యావత్ దేశానికి 63 శాతం ధాన్యాన్ని అందించిందని, మిగిలిన లిఫ్టులు కూడా పూర్తి అయితే తెలంగాణ యావత్ భారత దేశానికి ధాన్యాగారంగా మారబోతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండి డివి ప్రసాద్ స్వయంగా దేశంలో సేకరించిన ధాన్యం వివరాలను వెల్లడించారని, తెలంగాణను అభినందించారని సీఎం వివరించారు.

ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన తెలంగాణ రైతానికి త్వరలో అతిపెద్ద శుభవార్త చెప్పబోతున్నానని, ఆ శుభవార్తకు సంబంధించి ఆర్థిక పరమైన అంఛనాలు రెడీ అయ్యాయని, త్వరలోనే మరోసారి లెక్కలు సరి చూసుకుని.. వారం, పది రోజుల్లో రైతాంగానికి గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తాను ప్రకటించనున్న కొత్త పథకం విజయవంతంగా అమలైతే.. బంగారు తెలంగాణ కల సుసాధ్యమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

‘‘ ఇంజనీర్లకు సాల్యూట్ చేస్తున్నా.. ఈ వర్క్ అనితర సాధ్యం.. పెంటారెడ్డి … జెన్కో ట్రాన్స్కో అదికారులు అద్భుతంగా పని చేశారు.. రెవెన్యూ సిబ్బంది కూడా భూ సేకరణ అద్భుతంగా చేశారు వర్కింగ్ ఏజెన్సీస్ మెగా, నవయుగ, షాపూర్ పల్లంజీ, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు అద్భుతంగా పనిచేశాయి ’’ అని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ సమగ్ర వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శమని ఆయనన్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన సాగునీరు కాళేశ్వరం ప్రాజెక్టుదని, ఆ ఖరీదైన నీటితో అంతే ఖరీదైన పంటలు పండించి బంగారు తెలంగాణలో రైతులు భాగస్వామ్యం కావాలని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం నీటి కోసం రైతుల పక్షాల ప్రభుత్వమే 10 వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లును భరిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.